సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి చిరు జల్లులతో ప్రారంభమైన వర్షం క్రమంగా పెరిగి ఏకధాటిగా మూడున్నర గంటల పాటు దంచి కొట్టింది.గురువారం తెల్లవారుజామున వరకు కురిసిన భారీ వర్షానికి పట్టణం జలదిగ్బంధంలో చిక్కింది.
లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా,కొన్ని ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు.కనీస అవసరాలు కూడా తీర్చే వారు లేక, ఇళ్లలో నుండి బయటికి రాలేక దిక్కుతో స్థితిలో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు.
భారీ వర్షం కారణంగా పట్టణంలో పలు కాలనీల్లో జనజీవనం అతలాకుతలమైంది.వర్ష ప్రభావానికి ఉప్పొంగిన 60 ఫీట్ రోడ్డు నాలా నీట మునిగిన సమీప 37,34,46,47 వార్డుల్లో నీరు చెరువులను తలపిస్తుంది.
మున్సిపల్ అధికారులు ఉదయం నుండే పలు ప్రాంతాలను సందర్శించి,నివారణ చర్యలు చేపడుతున్నారు.సూర్యాపేట 60 ఫీట్ రోడ్డు ఎగువ భాగం నుండి వరద ప్రవాహం భారీగా పెరగడంతో 60 ఫీట్ రోడ్డు నాలా పొంగిపొర్లి సమీప వార్డులను నీటితో ముంచెత్తింది.
అర్ధరాత్రి కావడంతో మున్సిపల్ అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.మంత్రి జగదీశ్ రెడ్డి ఆదేశాలతో తెల్లవారు జాము నుండి నీటి ప్రవాహంలో ఆటంకాలను తొలగించే పనులను మొదలుపెట్టారు.
మున్సిపాలిటి అధికారులు ఎగువ ప్రాంతం నుండి భారీగా వరద వస్తుండటంతో నీట మునిగిన కాలనీలు వరద నుండి బయటపడేందుకు ఇంకా సమయం పట్టె అవకాశం ఉందని తెలుపుతున్నారు.ప్రతిసారీ ఇదే తంతు జరుగుతున్నా శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టని పాలకులు,ఇబ్బందులు పడుతున్న పట్టణ ప్రజలు.