సూర్యాపేట జిల్లా: ప్రభుత్వ బడులు నిలబడాలి చదువులో అంతరాలు పోవాలని,ప్రభుత్వ విద్యా సంస్థలను నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులదేనని తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, నల్లగొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు.సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ రోజురోజుకు అంతరించిపోతున్న ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలలను కాపాడుకోవాలని,విద్యార్దులు చేరకపోతే విద్యా సంస్థలు మూత పడతాయని,ప్రభుత్వ పాఠశాలు ఉంటేనే సమాజానికి ఉపయోగమన్నారు.
రాష్ట్రంలో క్రమంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని,బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు.అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు,ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంతో పాటు మంచి బోధన ఉందని విద్యార్థినీ విద్యార్థులకు,తల్లిదండ్రులకు తెలియజేయాలని కోరారు.
పాఠశాలల పట్ల గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఏమి చేయలేదన్నారు.ప్రస్తుత ప్రభుత్వమైన అలాంటి తప్పిదాలు చేయకుండా ప్రభుత్వ పాఠశాలల పట్ల శ్రద్ధ వహించాలన్నారు.ప్రతి పాఠశాలలో అధ్యాపకుల కొరత లేకుండా చూడాలని,సర్వీస్ పర్సన్ లను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో టిపిఎస్వి రాష్ట్ర,జిల్లా కమిటీ సభ్యులు,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.