సూర్యాపేట జిల్లా: సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు పరిశుభ్రతకు మారుపేరు.ఈ వీధి ఒకప్పుడు మంచి సీసీ రోడ్డుతో,మురికి కాలువలతో నివాస యోగ్యానికి అనుకూలంగా ఉండేది.
ఈ వార్డు వాసులం కూడా మా వీధిని చాలా సుందరంగా ఉంచుకునే వాళ్ళము.కానీ,ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా తారుమారైంది.
మా వీధి గుండా నడవాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి.దీనికి కారణం సూర్యాపేట- దంతాలపల్లి( Suryapeta- Dantalpalli ) రోడ్డుకు బహుళ అంతస్తుల నిర్మాణాలు జరగడంతో వాటికి మురికి కాలువలు లేకపోవడం వలన ఆ బహుళ అంతస్తులలో నివసిస్తున్న వారి మురుగునీరు మొత్తం మా వీధి గుండా ప్రవహించి, మాకు అసౌకర్యంగా మారింది.
ఒకప్పడు సుందరమైన కాలనీ వీధులు ఇప్పుడు చిందర వందరగా మారడంతో ఈ వీధిలో ఎందుకు ఉంటున్నామా? అని బాధపడే పరిస్థితి వచ్చింది.మా కాలనీ వాసుల బాధను కౌన్సిలర్, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు.
వీధి మొత్తం మురుగునీరు ఉండడంతో దుర్వాసనతో భరించలేని విధంగా మారింది.పిల్లలు బడుల నుండి ఇంటికి వస్తున్న సమయంలో ఆ మురికి నీటిపై నడుచుకుంటూ రావడంతో వాళ్ళ కాళ్లు చెడిపోయి,చర్మ వ్యాధులు వస్తున్నాయి.
ఇప్పటికైనా మా గోడు అర్దం చేసుకొని బహుళ అంతస్తుల నుండి వచ్చే మురికినీరు ఈ వీధి గుండా ప్రవహించకుండా అంతస్తుల ముందు ఇంకుడు గుంటలు తీసుకోనేలా చర్యలు చేపట్టి,కాలనీ వాసుల ఆరోగ్యాలను కాపాడవలసిందిగా కోరుతూ సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ కి కాలనీ వాసులు లేఖ రాశారు.