సూర్యాపేట జిల్లా:కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో “సమస్యలు లేవని జిల్లా వైద్యాధికారులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కోదాడ సామాజిక కార్యకర్త కుదరవల్లి బసవయ్య బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో డ్రింకింగ్ వాటర్ లేదని,పార్కింగ్ స్థలం లేదని, స్త్రీల ఇన్ పేషెంట్ వార్డులో కొన్ని ఫ్యానులు లేవన్నారు.
అలాగే దంత వైద్యుడు పేషెంట్ ట్రీట్మెంట్ కు ఉపయోగించే చైర్ కొన్నేళ్లుగా పనిచేయటం లేదన్నారు.అయినా పట్టించుకొనే అధికారులు గానీ,అభివృద్ధి కమిటీ గానీ లేదని,హాస్పిటల్ స్థలంలో 10 కుంటలు స్థలం కొన్ని సంవత్సరాలుగా ఆక్రమణలో ఉన్నా పట్టించుకొనే నాథుడు లేడన్నారు.
కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మొత్తం 16మంది డాక్టర్లు ఉండాల్సి ఉండగా,కేవలం 7 గురు మాత్రమే ట్రెయిన్డ్ డాక్టర్లు ఉన్నారని,అందులో ఇద్దరు మత్తు డాక్టర్లేనని,మిగిలిన 5 గురు డాక్టర్లలో ఒకరు ఆర్థోఫెడిక్ సర్జన్ ఉన్నా ఆయనకు కావలసిన పరికరము లేక ఆపరేషన్స్ చేయకుండా వచ్చిన వారికి కట్లు కట్టి పంపిస్తున్నారని,సరైన డాక్టర్లు లేకుండా ఆసుపత్రికి రోగులు ఎలా వస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.వైద్య సిబ్బంది పరిస్థితి ఇలా ఉంటే ఆసుపత్రి చెందిన అంబులెన్స్ చెడిపోయి నాలుగేళ్లైనా దానిని రిపేర్ చేయడం గానీ, సంబంధిత అధికారులకు అప్పజెప్పడం గానీ,నేటికీ జరగలేదన్నారు.
మిగిలిన కొద్ది స్థలంలో రిలయన్స్ టవరు, ఉపయోగంలో లేని మున్సిపల్ ఓవర్ హెడ్ ట్యాంక్, పనికిరాని బిల్డింగు,ముత్యాలమ్మ గుడి పేరుతో కొంత పోవడంతో కనీసం పార్కింగ్ స్థలం లేకుండా పోయిందని, భవిష్యత్ లో 100 పడకల ఆసుపత్రి అయితే భవన నిర్మాణానికి ఇక్కడ స్థలం లేకుండా చేశారని వాపోయారు.ఇక రోగులకు టీకాలు వేసేందుకు కేటాయించిన బిల్డింగును డిసిహెచ్ఎస్ ఆఫీస్ పెట్టుకోవడంతో ప్రస్తుతం టీకాలు అర్బన్ అండ్ హెల్త్ సెంటర్లో వేస్తున్నారన్నారు.
కోదాడ ప్రభుత్వ హాస్పటల్ పర్యవేక్షణాధికారి (డిసిహెచ్ఎస్)డాక్టర్ వెంకటేశ్వర్లు,ఆయన భార్య డాక్టర్ నాగమణి హుజూర్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేస్తూ రెగ్యులర్ గా విధులకు హాజరు కాకుండా ఇద్దరూ కలిసి కోదాడలో ఆదిత్య హాస్పిటల్ పేరుతో ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారని ఆరోపించారు.సకల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి సరైన డాక్టర్లు లేకుండా,వైద్య సేవలు అందుబాటులో లేకుండా,సమస్యలకు నిలయంగా మారితే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు లేవని జిల్లా వైద్యాధికారి చెప్పడం విస్మయం కలిగిస్తుందన్నారు.
డిసిహెచ్ఎస్ డాక్టర్ వెంకటేశ్వర్లు వివరణ:ఆసుపత్రిలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటి అధిగమిస్తూ వస్తున్నాం.ఇక్కడ పని చేసిన డాక్టర్లు కొందరు ఉన్నత చదువులపై వెళ్ళిపోయారు.
ఇద్దరు మెటర్నిటీ లీవ్ లో ఉన్నారు.డాక్టర్ల కొరత, అంబులెన్స్ సమస్యలు ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయి, త్వరలోనే సమస్య పరిష్కారం చేస్తామన్నారు.
ముత్యాలమ్మ గుడి పూర్వం నుండే ఉంది.ఆసుపత్రిలో ఆఫీసుకు సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల ఉన్నాయి.
అయినా ఇంకా జిల్లా కేంద్రం నుండి షిఫ్ట్ కాలేదు.ఆక్రమణలు విషయం కోర్టు పరిధిలో ఉంది.
సెల్ టవర్,ఓవర్ హెడ్ ట్యాంక్ తొలగిస్తామని చెప్పారు.మా భార్య డాక్టర్ నాగమణి హుజూర్ నగర్ లో విధులు ముగిశాక సాయంత్రం వేళ కోదాడ ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఓపిలు చూస్తారు.
అంతే కానీ,మాకు కోదాడలో ప్రైవేట్ హాస్పిటల్ లేదు.కావాలంటే మా గురించి ఎవరైనా విచారణ చేసుకోవచ్చు.