బడిలో గడపాల్సిన బాల్యం ఇటుక బట్టిల్లో బందీ...!

సూర్యాపేట జిల్లా:పుస్తకాలు చేతపట్టి బడిలో సరదాగా గడపాల్సిన బాల్యం తల్లిదండ్రుల అమాయకత్వం,కొందరి స్వార్దంతో ఇటుక బట్టీల్లో మట్టి పిసుకుతూ మగ్గిపోతున్న వైనం సూర్యాపేట జిల్లాలో వెలుగులోకి వచ్చింది.అనంతగిరి మండలం బొజ్జగూడెం గ్రామ సమీపంలో గల హెచ్ పి పెట్రోల్ బంక్ పక్కన కొండలరావు అనే ఇటుకల వ్యాపారి ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నాడు.

 The Childhood Spent In School Is A Hostage In Brick And Mortar , Bojjagudem Vill-TeluguStop.com

ఈ ఇటుక బట్టీల్లో పనిచేయడానికి తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల నుండి పొట్ట చేతపట్టుకొని పేద కుటుంబాలు వలస కూలీలుగా వస్తారు.ఈ కుటుంబాల్లోని 14 ఏళ్ల లోపు పిల్లలు చదువుకు దూరమై బాలకార్మికులుగా మారి ఇటుకల తయారీలో శ్రమ దోపిడికి గురవుతున్నారు.

పిల్లలు పని చేస్తున్న దృశ్యం కనిపించగా వారిని వీడియో తీసేందుకు ప్రయత్నం చేయగా పిల్లలు అక్కడి నుండి గుడిసెల్లోకి పారిపోయారు.విద్యా హక్కు,కార్మిక,వాల్టా చట్టాలను తుంగలో తొక్కిన బట్టీ వ్యాపారిని వివరణ కోరగా ముందుగా పిల్లలు ఎవరూ ఇక్కడ పని చేయడం లేదని దబాయించి,తర్వాత ఒక్క పిల్లాడు మాత్రమే పని చేస్తున్నాడని,అమ్మాయి ఊరికే అక్కడికి వచ్చిందని చెప్పడం గమనార్హం.

వారితో పని చేయించడం నేరం కదా అని అడగగా వారు ఇక్కడి వారు కాదని వేరే రాష్ట్రం నుండి వచ్చారని,ఆ అబ్బాయితో కూడా ఇక నుండి పని చేయించమని చెప్పడం కొసమెరుపు.అయితే ఈ ఇటుక బట్టీలు మొత్తం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, నిబంధనలకు నీళ్ళు వదిలి గ్రామపంచాయతీకి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతూ కోట్లలో వ్యాపారం చేస్తూ,లక్షల్లో ఆదాయం వస్తున్నా పన్నులు వసూళ్లు చేయకుండా అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

వలస కార్మికులకు చాలీచాలనీ జీతాలు చెల్లించి కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని,ఇటుక బట్టీల కోసం స్థానిక చెరువులు,కుంటలు,శిఖం భూముల్లో నుండి అక్రమంగా మట్టిని తరలిస్తున్నా కనీసం ఇటు వైపు కన్నెత్తి చూసే నాథుడే కరువయ్యాడని తెలుస్తోంది.ఊరికి దూరంగా ఉన్న ఈ ఇటుక బట్టీల్లో పనిచేసే వలస కూలీలకు కనీస వసతుల్లేవు.

ఉండటానికి చిన్న గుడారాలు వేసుకుని,కర్రలు పాతి, చుట్టూ పాతచీరలు కట్టి వాటి చాటున మహిళలు స్నానాలు చేస్తుంటారు.ఇటుక బట్టీలే తమ జీవనాధారం కావడంతో కష్టాలు ఓర్చుకుంటూ పని చేసుకొని వెళ్లిపోతారు.

వారితో పాటు తమ పిల్లలను చదువులు మాన్పించి వారి భవిష్యత్తును బట్టీల్లో బుగ్గి చేస్తున్నారు.కానీ,కార్మిక,విద్యా శాఖ అధికారులకు ఈ విషయం గురించి పట్టకపోవడం విస్మయం కలిగిస్తోంది.

అసలు బట్టీల్లో పనిచేసే కార్మికులకు కల్పించాల్సిన వసతులు ఏమిటి? కార్మిక హక్కులు ఏమిటో ఎవరూ పట్టించుకోరు.అసలు ఏయే రాష్ట్రాల నుంచి ఎంతమంది పనిచేస్తున్నారో కూడా రెవెన్యూ,కార్మికశాఖ అధికారుల వద్ద వివరాలు లేకపోవడంతో ఇటుక బట్టీల వ్యాపారం ఎలా నడుస్తుందో అర్దం చేసుకోవచ్చు.

దీనిపై జిల్లా కార్మిక శాఖ అధికారి రాజ్ కుమార్ వివరణ కోరగా బట్టీల నిర్వాహకులు తమవద్ద ఎంతమంది పనిచేస్తున్నారు.ఎక్కడెక్కడి నుంచి కూలీలను తీసుకువచ్చింది.తమకు లిఖిత పూర్వకంగా వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని,ఈ ఏడాది ఇంతవరకు వివరాలు ఇవ్వలేదు.ఒకటి రెండు రోజుల్లో పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు.

ఇటుక బట్టిలలోని కార్మికుల శ్రమను సంపాదనగా మార్చుకుంటున్న నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.అధికారులు ప్రతి నెల మామూలు తీసుకుంటూ ఇటుక బట్టి నిర్వాహకులకు సలాం అంటూ గులాంగిరి చేస్తున్నట్టు మండలంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇకనైనా ఇలాంటి అక్రమ ఇటుక బట్టీలకు ప్రభుత్వ అనుమతి ఉందా?ఉంటే ప్రభుత్వ నిబంధనల మేరకే నిర్వహిస్తున్నారా? అనే దానిపై తగు విచారణ జరిపి చర్యలు తీసుకోవలసిందిగా మండల ప్రజలు కోరుతున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube