నల్లగొండ జిల్లా:వేసవి సీజన్ వెళ్ళిపోయినా ఎండలు దంచి కొడుతున్నాయి.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గత మూడు రోజుల నుండి 42 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఈ పరిస్థితుల్లో రైతులు తొందరపడి పత్తి విత్తనాలుపెట్టొద్దని జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు అన్నదాతలకు విజ్ఞప్తి చేస్తున్నారు.వాతావరణ శాఖ వర్షాలు వస్తాయని చెపుతున్నా ఎప్పుడొస్తాయో తెలియదని,అయినా కొందరు రైతన్నలు ఆర్బటంగా పొడి దుక్కులు దున్నీ ఏ మాత్రం పదును లేకుండానే పత్తి విత్తనాలు విత్తుతున్నారని,పొడిదుక్కిలో విత్తనాలు నాటడం వలన మొలకలు సరిగా రావని నిపుణులు చెపుతున్నారని,అందుకే పదును లేకుండా విత్తనాలు వేయవద్దని ఇప్పటికే జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు.
వ్యవసాయ అధికారులు సైతం రైతు సమావేశాలు పెట్టి తగు సూచనలు చేస్తున్నారు.విత్తన డీలర్లు పదే పదే చెప్పినా వినకుండా పెడచెవిన పెట్టిన కొందరు రైతులు విత్తనాలు నాటుతున్నట్లు సమాచారం.
ఇప్పుడు విత్తనాలు నాటడం వలన రైతులు తీవ్ర నష్టాలను చవి చూడాల్సి వస్తుందని, సరైన వర్షాలు పడి రోహిణి కార్తె ముగింపు దశలో లేదా రోహిణి కార్తె పోయాక భూమిచల్లబడిన తర్వాత దయచేసి రైతులు విత్తనాలు నాటుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.బెట్ట దుక్కుల్లో విత్తనం మొలక శాతం రాకపోతే మళ్ళీ మళ్ళీ విత్తనాలు నాటుకుంటూ పొతే ఎకరాకు సుమారు ఇరవై వేల రూపాయల వరకు ఆర్ధికంగా దాకా నష్టపోవాల్సి వస్తోందని నిపుణులు చెపుతున్నారు.
ఈ విషయాలను రైతులు గుర్తెరిగి సరైన సమయంలో వర్షాలు పడ్డ తర్వాత మాత్రమే విత్తనాలు నాటలని,దాని ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని అంటున్నారు.జూన్ నెలలో వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున రైతులు ఒకటి రెండు వర్షాలు వచ్చిన తరవాత మాత్రమే పత్తి విత్తనాలు నాటుకోవాలి తద్వారా విత్తన మొలక శాతం అధికంగా ఉంటుందని,అధిక దిగుబడి సాధించే అవకాశం కూడా ఉంటుందని నల్లగొండ వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్ అంటున్నారు.