అకాల వర్షంతో అన్నదాత అతలాకుతలం...!

నల్లగొండ జిల్లా: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షానికి ఐకెపి కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం వర్షపు నీటితో తడిసి,కొన్నిచోట్ల కొట్టుకు పోవడంతో చేతికందిన పంట చేజారి అన్నదాతలు తీవ్ర అవస్థలు పడ్డారు.

రెక్కలుముక్కలు చేసుకొని ఆరుగాలం ఇంటిల్లిపాది చెమటోడిచి పండించిన పంట తీరా కళ్ళంలో పోసి అమ్మే సమయానికి ప్రకృతి ప్రకోపానికి బలైపోతుందని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఒక్కసారిగా వచ్చిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి కళ్ళాలలో,రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దవ్వడంతో రైతన్నల ఆశలు ఆవిరైపోయాయి.సరైన వర్షాలు పడక,కరెంట్ సక్రమంగా రాక ఖరీఫ్ మొత్తం పొలాలు ఎండిపోయి పంటలు కాపాడుకునేందుకు రోడ్డెక్కిన అన్నదాతలు, చివరికి పోయేదిపోగా ఉన్న పంటను కోసి కళ్ళాల్లోకి తెచ్చి పోస్తే అకాల వర్షాలతో ధాన్యం తడిచిపోయిందని,కొన్ని మండలాల్లో కొట్టుకుపోయిందని,ఇక పొలంలో ఉన్నపంట నేలకొరిగి చేతికి అందకుండా పోయిందని, పాలకుల,ప్రకృతి చేతిలో నిరంతరం రైతు బతుకు ఆగమైపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు ప్రచారంలో మునిగిపోతే, అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని,ఇక మమ్ముల్ని పట్టించుకునే వారెవరని వాపోతున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.

కాబోయే కొత్తజంటలకు లగ్గాల బ్రేక్...మూడు నెలలు ముహూర్తాలు లేనట్లే...!
Advertisement

Latest Nalgonda News