నల్గొండ జిల్లా:శాలిగౌరారం మండలం ఇటుకులపహడ్ గ్రామంలో శ్రీ మహాదేవ దేవస్థానం,బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ విడివిడిగా హాజరై పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు.పూజా కార్యక్రమాలు ముగించుకొని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ అక్కడి నుంచి వెళ్లిపోయిన ఆనంతరం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగిస్తూ కేసీఆర్ పై విమర్శలు చేస్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు,బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీసింది.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ప్రవర్తనపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ నకిరేకల్ 65వ నెంబర్ జాతీయ రహదారి నుండి అర్వపల్లి దాకా ఉన్నటువంటి రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఇటుకులపహాడ్ ఉందని,ఈ గ్రామానికి రావడానికి మూడు కిలోమీటర్లకి గంట సమయం పట్టిందని,గ్రామ రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు.కెసిఆర్ ఐదు లక్షల కోట్ల అప్పు చేసిండు,పాత సెక్రటేరియేట్ కూలగొట్టి కోట్ల రూపాయలతో కొత్త సెక్రటేరియేట్ కట్టిండని అన్నారు.
ప్రగతి భవన్ వెయ్యి కోట్లతో కట్టిండు.కానీ,ఇటుకులపాడు గ్రామానికి కేవలం ఒక కోటి రూపాయలు పెడితే రోడ్డు వచ్చేదని అన్నారు.
ఇటుకులపహడ్ లో ఒక్క పేదవాడికి కూడా ఇల్లు కట్టలేదని,ఇటుకులపహడ్ కు రోడ్డు లేదని,పంచాయతీరాజ్ మినిస్టర్ తో మాట్లాడి గ్రామానికి రోడ్డు వేయిస్తానన్నారు.తాను తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేశానని,పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు.