సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ నిర్వహించిన జిల్లా ప్రజాసంఘాల బాధ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెడుతున్న పథకాలను రాష్ట్రంలో పూర్తిగా అమలు చేసిన పాపాన పోలేదన్నారు.
గతంలో ప్రవేశపెట్టిన దళిత,గిరిజనులకు మూడు ఎకరాల సాగు భూమి,డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, గొర్రెల పంపిణీ వంటి పథకాలు నేటికీ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో అమలు కాలేదని ఆరోపించారు.తెలంగాణ రాష్ట్రంలో 2లక్షల 50 వేల ఖాళీ ఉద్యోగాలు ఉన్నాయని,వాటిని పూర్తిస్థాయిలో భర్తీ చేయకుండా కేవలం 80 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.
ఎస్సీ,ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు.రుణమాఫీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సూర్యాపేట జిల్లా అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమన్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బడ్జెట్ పేద,మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకంగా ఉందన్నారు.విద్య,వైద్యం,ఉపాధి రంగాలకు అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
పేదల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల 50 వేల రూపాయలు ఇవ్వాలని కోరారు.ప్రజా సమస్యలపై ప్రజా సంఘాలు బలమైన ప్రజా ఉద్యమాలకు రూపకల్పన చేసి ప్రజల హక్కుల సాధనకై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
సిఐటియు జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు,కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు కొప్పుల రజిత,ఐద్వా జిల్లా కార్యదర్శి మేఘనబోయిన సైదమ్మ,ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న,తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు,ఆవాజ్ జిల్లా కార్యదర్శి షేక్ జహంగీర్,మత్స్య కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నల్లమేకల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.