యాదాద్రి భువనగిరి జిల్లా: ఆలేరు నియోజకవర్గ కేంద్రం నడిబొడ్డున జాతీయ రహదారిపై పోలీస్ స్టేషన్ సమీపంలో గతంలో ఎలాంటి రక్షణ కవచం లేకుండా చేతికి అందె ఎత్తులో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా మారి నిత్యం డేంజర్ బెల్స్ మోగిస్తున్నా సంబధిత అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నిత్యం ప్రజలు సంచరించే ప్రాంతంలో ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ అధికారులకు కనిపించడం లేదా అని మండిపడుతున్నారు.
ట్రాన్స్ఫార్మర్ ను ఇక్కడి నుండి తరలించడం కోసం దిమ్మె ఏర్పాటు చేసి ఏళ్లు గడుస్తున్నా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ట్రాన్స్ఫార్మర్ ను మాత్రం షిఫ్ట్ చేయడం లేదని,చిన్న పిల్లలు తెలియక ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత విద్యుత్ అధికారులు స్పందించి వెంటనే ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ ను అక్కడి నుంచి తొలగించి దిమ్మపై ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
జాతీయ రహదారిపై ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను వెంటనే తొలగించాలని చెక్క వెంకటేష్ అన్నారు.ఎన్నో రోజుల నుంచి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను పక్కనే ఏర్పాటు చేసిన దిమ్మ మీద ఏర్పాటు చేయాలని కోరారు.