సూర్యాపేట జిల్లా:మోడీ అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాల మూలంగా దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలోకి నెట్టబడుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మీ విమర్శించారు.బుధవారం జిల్లా కేంద్రంలోని ఎంవిఎన్ భవనంలో జరిగిన ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి తగిన నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.విదేశాల్లో వ్యవసాయ రంగానికి ఏడు నుండి 10 శాతం నిధులు కేటాయిస్తుంటే భారతదేశంలో మాత్రం 3.2 శాతం మాత్రమే నిధులు కేటాయిస్తున్నారని దీని మూలంగా వ్యవసాయ రంగం దివాలా తీసే పరిస్థితి ఉందన్నారు.దేశవ్యాప్తంగా రైతులు పండించిన పంటకు మద్దతు ధర అందడం లేదన్నారు.రైతాంగానికి నాణ్యమైన విత్తనాలు,ఎరువులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.కంపెనీ వ్యవసాయం పేరుతో వ్యవసాయ రంగంలో కార్పొరేట్ శక్తులను ప్రవేశపెట్టాలని ఆలోచనలను రైతాంగం ఉద్యమాలతో ఎండగట్టారని తెలిపారు.వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం కోసం స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పి ఎందుకు తాత్సారం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రాష్ట్రంలో రైతాంగానికి ఏకకాలంలో రుణమాఫీ చేయకపోవడంతో రైతులు వడ్డీలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులకు సకాలంలో రుణమాఫీ చేయకపోవడంతో మరల వ్యవసాయ సీజన్ ప్రారంభం కాగానే బ్యాంకర్లు రుణాలు మంజూరు చేసే పరిస్థితి లేకపోవడంతో పెట్టుబడి లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ప్రభుత్వం వెంటనే రైతుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఏకకాలంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంకోసం ఏర్పాటు చేసిన ఐకెపి కేంద్రాలలో గన్ని బ్యాగులు,లోడింగ్ అన్లోడింగ్,తేమ పేరుతో వస్తున్న సమస్యలను అధికారులు వెంటనే పరిష్కారం చేయాలన్నారు.
ఐకెపి కేంద్రాల్లో ధాన్యం కొనుగోలును వేగవంతం చేసి రైతాంగానికి సకాలంలో డబ్బులు ఎకౌంట్లో జమ చేయాలన్నారు.ఐకెపి కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగకపోవడంతో రైతులు రోడ్లమీద వరి ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం,రాసి పోయడం లాంటి సమస్యలతో నిరంతరం ఇబ్బందులు పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు.
కాబట్టి ఐకెపి కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి,లోడింగ్ చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అన్నారు.
ఆయా జిల్లాల్లో స్థానికంగా ప్రజలు సమస్యలతో సతమతమవుతూ అధికారుల దృష్టికి తీసుకువచ్చిన పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు.సూర్యాపేట జిల్లా కేంద్రంలో పాత జాతీయ రహదారి రోడ్డు విస్తరణ పనులు ఆగిపోవడంతో పట్టణ ప్రజలు మరియు సూర్యాపేటకు వచ్చే చుట్టూ పది మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
వెంటనే పట్టణంలోని రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.పట్టణ శివారు ప్రాంతాలను,మున్సిపాలిటీలో విలినమైన గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని అన్నారు.
పట్టణ ప్రాంత పేదలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వర్తింపచేయాలన్నారు.అర్హులైన పేదలందరికీ ఇళ్లు,ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను సమీకరించి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు,ఎలుగూరి గోవిందు,కోట గోపి, మేకనబోయిన శేఖర్,ధనియాకుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.