నల్లగొండ జిల్లా:మంది ప్రాణాలు ఎన్ని పోయినా ఫర్వాలేదు కానీ,మద్యం విక్రయాలు పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను సమాజంపైకి వదిలేసినట్లుగా ఉంది నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో మద్యం పాలసీ విధానం.మిర్యాలగూడలో మద్యం విక్రయాల అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.
రహదారులపై మద్యం సేవించరాదనే ఉద్దేశంతో ఎక్సైజ్ శాఖ మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్ లకు అనుమతులు ఇచ్చి,ఇందులో కూడా నిబంధనలు పాటించలని సూచించింది.ఇందులో భాగంగా పట్టణంలో కొన్ని మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్ లకు ఎక్సైజ్ శాఖ అనుమతులు ఇచ్చింది.కానీ,ఈ పర్మిట్ రూమ్ లలో ఎక్కడా నిబంధనలు మాత్రం కానరావు.100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండాల్సిన పర్మిట్ గదులు వారికున్న సౌకర్యాన్ని బట్టి బార్లను తలపించేలా వందల చదరపు మీటర్లు విస్తీర్ణంలో అనుమతి గదులు ఏర్పాటు చేయడంతో పర్మిట్ రూమ్ లు విశాలమైన బార్లను తలపిస్తున్నాయి.ఈ పర్మిట్ రూమ్ లల్లో మద్యం కొనుగోలు చేసిన వారు నిలబడి మద్యం సేవించి వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉంది.కానీ,నిబంధనలను తుంగలో తొక్కి వందల సంఖ్యలో మందుబాబులు కూర్చునేలా కుర్చీలు, బల్లాలు ఏర్పాటు చేశారు.
ఇంతటితో ఆగకుండా పర్మిట్ రూమ్ లో తినుబండారాలు విక్రయించకూడదనే నిబంధనలు ఉన్నా,నిర్వాహకులు రకరకాల తినుబండారాలతో పాటు, ఏకంగా ఇక్కడ గ్యాస్ పొయ్యిలు పెట్టి మాంసాహారపు వంటలను వండి వడ్డిస్తూ ప్రభుత్వ నిబంధలకు నీళ్ళు వదులుతున్నారు.వారు అక్రమ దోపిడీ కూడా చట్టబద్ధమైనట్లు పర్మిట్ రూమ్ లో బయటి తినుబండారాలు అనుమతి లేదని గోడలపై రాయడం,ఏకంగా తినుబండారాల ధరల బ్యానర్లు ఏర్పాటు చేయడం గమనార్హం.
ఇదంతా బహిరంగంగా జరుగుతున్నా సంబంధిత అధికారులు కనీసం కన్నెత్తి కూడా ఇటు వైపు చూడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది.దీనికి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మద్యం పాలసీ ద్వారా విక్రయాలు జరిపితే ఆదాయం సరిపోదని,ఎంత ఎక్కువ అమ్మకాలు జరిపితే అంత రాబడి ఉంటుందనే లెక్కలతో మద్యం అమ్మకాల నిబంధనలు గాలికొదిలిలేసిందని తేటతెల్లమవుతుంది.
దీనితో ఎక్కువ మొత్తంలో మందుబాబులు ఒక్క దగ్గర చేరడంతో నేరగాళ్లకు అడ్డాగా మారుతున్నాయి.అయినా పోలీస్ యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషిస్తుంది.ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.నిబంధనలు పెట్టేది వారే,వాటిని ఎంచక్కా ఉల్లంఘించేది వారే.
ఇష్టానుసారం మద్యం దుకాణాలదారులను ప్రోత్సహించేది వారే,మద్యం వ్యాపారులతో కలిసి మందు బాబుల జేబులకు చిల్లుల్లు పడేలా దోపిడికి పాల్పడేది వారేనని తరచూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పర్మిట్ రూములను ఏమాత్రం కట్టడి చేయకపోవడంతో పాటు,ఇంకో రకం కొత్త మోసానికి పట్టణంలో తెరతీశారు.
ఇది చాలదన్నట్లుగా మద్యం దుకాణానికి అనుబంధంగా ఉన్న పర్మిట్ రూముల నిర్వహణ బాధ్యతలను లక్షల్లో వేలం పాడి దక్కించుకుంటూ,తమ ఇష్టానసారంగా దోచుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.ఇదిలా ఉంటే పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో సరిపడా స్థలం లేక అనుమతులు గదులు ఏర్పాటు చేయలేదు.
అనుమతి లేకుండానే ఏర్పాటు చేసిన ప్రతి చోట మద్యం దుకాణాల నిర్వహకులు ఇతరులకు లీజుకు ఇస్తున్నారు.ఈ లీజు ధర నెలకు లక్షల్లోనే ఉంటుంది.
లీజ్ ద్వారా వచ్చే డబ్బులతోనే మద్యం దుకాణాల అద్దెలు, సిబ్బంది వేతనాలు చెల్లిస్తున్నట్లు సమాచారం.అందుకే నిబంధనలను పాటిస్తే తమకేమీ గిట్టుబాటు కాదనే ఉద్దేశంతోనే నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ మందుబాబుల జేబులకు చిల్లులు పెడుతున్నారు.
అనుమతి గదులు లేనిచోట రోడ్డుపైన మందుబాబులు మద్యం తాగుతుండడంతో మహిళలు,చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇంత జరుగుతున్నా తమకేమి పట్టనట్లుగా చోద్యం చూస్తున్న ఎక్సైజ్,పోలీసు శాఖల అధికారుల తీరుపై పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.