భారత క్రికెట్ మాజీ కెప్టెన్, మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ ( Rahul Dravid ) ఓ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.ఈ ఘటన బెంగుళూరు నగరంలో చోటు చేసుకుంది.
ద్రావిడ్ ప్రయాణిస్తున్న కారు ముందు భాగాన్ని ఓ లోడింగ్ ఆటో రిక్షా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో కారుకు స్వల్ప నష్టం జరిగిందని సమాచారం.
అదృష్టవశాత్తు రాహుల్ ద్రావిడ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు.దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదం అనంతరం రాహుల్ ద్రావిడ్ ఆటో డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు.దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో ద్రావిడ్ స్వయంగా కారును డ్రైవ్ చేస్తూ ఉండటం స్పష్టమవుతోంది.అయితే ఈ ప్రమాదానికి కారణం ద్రావిడ్ నిర్లక్ష్యంగా కారు నడపడం వల్ల, లేక ఆటో డ్రైవర్ ( Auto driver )తప్పిదం వల్ల అనేది ఇంకా స్పష్టత లేదు.ఆటో డ్రైవర్ ద్రావిడ్‌కు ఏదో వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది.ఈ ఘటనపై ఇద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.రాహుల్ ద్రావిడ్ ప్రశాంత స్వభావానికి పేరుగాంచిన వ్యక్తి.ఈ ఘటనపై అతను చాలా కూల్‌గా వ్యవహరించాడని వీడియో చూసిన అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
‘‘ద్రావిడ్ ఎప్పటిలానే సహనంతో పరిష్కరించుకునే వ్యక్తి’’ అంటూ సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.ఈ ఘటనతో రాహుల్ ద్రావిడ్ మరోసారి వార్తల్లో నిలిచారు.అయితే ప్రమాదం తర్వాత ఇద్దరూ వివరణ ఇచ్చుకోగా, పరిస్థితి అక్కడికే సర్దుమనిగినట్టు కనిపిస్తోంది.ఇక టీంఇండియా గత ఏడాది టీ20 ప్రపంచ కప్ గెలిచాక ద్రావిడ్ కోచింగ్ బాధ్యతల నుండి తప్పించుకున్నారు.