సూర్యాపేట జిల్లా:గ్రామాలలో గ్రామీణ వైద్యులుగా చలామణి అవుతున్న వారు లింగ నిర్ధారణ పరీక్షలు ప్రోత్సహిస్తున్నట్లు, వారితో కుమ్మక్కై జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులు కొన్ని ఈ అనైతిక చర్యలు చేపడుతున్నట్లు అనుమానం ఉందని, ఎవరైనా చట్ట విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసి, అబార్షన్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎం అండ్ హెచ్ఓ కోటా చలం హెచ్చరించారు.బుధవారం జిల్లా కేంద్రలోని జీఅర్ఏఫ్ కాలేజీలో నిర్వహించిన ఆశా వర్కర్ల శిక్షణ ముగింపు సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో గ్రామాలలో ప్రతి ఆశా కార్యకర్త లింగ నిష్పత్తిపై,ఆడపిల్లల రక్షణపై అవగాహన కల్పించాలన్నారు.
ఇప్పటికే ఒకటి లేక ఇద్దరు ఆడపిల్లలు ఉన్న గర్భిణీ స్త్రీలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు.రానున్న కాలములో లింగ నిష్పత్తిలో హెచ్చుతగ్గుల మార్పులు ఏర్పడి ఆడపిల్లలపై రక్షణ కొరవడుతుందన్నారు.
జిల్లాలో స్త్రీ,పురుష నిష్పత్తి గణనీయంగా తగ్గిందన్నారు.ఆశా కార్యకర్తలు ఈ అమానవీయ పద్ధతిని అడ్డుకోవాలని సూచించారు.
ప్రతి గ్రామీణ వైద్యుడిపై,ప్రైవేట్ ఆస్పత్రులపై నిఘా పెంచినామన్నారు.వయోవృద్ధులకు వారి ఇంటికి వద్దకు వెళ్లి ఆరోగ్య సేవలు అందించాలన్నారు.
మధుమేహం,రక్తపోటు ఉన్న వ్యాధిగ్రస్తులను గుర్తించి ఇంటి వద్దనే చికిత్స అందించాలన్నారు.ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి అంజయ్య గౌడ్ చట్టముపై అవగాహన కల్పించారు.
ముగింపు కార్యక్రమంలో శిక్షణ సమన్వయకర్త అన్నమ్మ,సదుపాయకర్తలు శిరోమణి,వినోద తదితరులు పాల్గొన్నారు.