ప్రస్తుత డిజిటల్ యుగంలో డిజిటల్ పేమెంట్స్ విపరీతంగా పెరిగాయి.ముఖ్యంగా ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ( PhonePay, Google Pay, Paytm ) (UPI) యాప్స్ వాడకం ఎక్కువైంది.
ఈ యాప్‌ల ద్వారా ఎక్కువగా మన లావాదేవీలు సులభతరం అవుతున్నాయి.అయితే, కొన్ని సందర్భాల్లో పొరపాటున మనం ఇతర వ్యక్తులకు డబ్బు పంపే అవకాశం ఉంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో మన డబ్బును తిరిగి ఎలా పొందాలి అనే సందేహం తలెత్తుతుంది.అయితే, కంగారు పడాల్సిన పనిలేదు.
కొన్ని సింపుల్ చర్యలు తీసుకుంటే 48 నుంచి 72 గంటల్లో మీ డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంది.ఇప్పుడు అందుకు అవసరమైన చర్యలు ఏవో తెలుసుకుందాం.

మొదటగా మీరు పొరపాటున డబ్బు వేరే వ్యక్తికి పంపినట్లయితే, ముందుగా ఆ యూపీఐ యాప్ కస్టమర్ కేర్‌కు కాల్ చేయండి.మీ ట్రాన్సాక్షన్ వివరాలను ( transaction details )స్పష్టంగా అందజేయండి.సంబంధిత బ్యాంక్ కస్టమర్ సపోర్ట్‌కు కూడా సమాచారం ఇవ్వండి.కొన్ని బ్యాంకులు ఈ-మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదులను స్వీకరిస్తాయి.మీ ట్రాన్సాక్షన్ ఐడీ, వర్చువల్ పేమెంట్ అడ్రస్ (VPA), పంపిన మొత్తం, తేదీ, సమయం వంటి వివరాలను ఈ-మెయిల్‌లో పంపండి.వారు మీ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తారు.

అంతేకాదు, ఎన్‌పీసీఐ (NPCI) కూడా ఈ సమస్యలను పరిష్కరించడంలో సహాయం చేస్తుంది.18001201740 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి మీ ఫిర్యాదును నమోదు చేయండి.అలాగే NPCI అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు.ఈ సమయంలో యూపీఐ ట్రాన్సాక్షన్ వివరాలు, ఇమెయిల్, ఫోన్ నంబర్ ఇవ్వడం చాలా ముఖ్యం.అంతేకాకుండా మీరు డబ్బు పంపిన వ్యక్తి ఫోన్ నంబర్‌ను గుర్తిస్తే, నేరుగా అందుకు సంబంధించి వారి వద్ద కాల్ చేసి మీ తప్పిదాన్ని వివరించండి.డబ్బు తిరిగి పంపాల్సిందిగా వినయపూర్వకంగా అభ్యర్థించండి.
ఎవరికైతే మీరు పొరపాటుగా డబ్బు పంపారో వారు స్పందించకుండా డబ్బు తిరిగి ఇవ్వకపోతే, సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి.ఇది సైబర్ క్రైమ్ కింద వస్తుంది.
కాబట్టి సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయండి.పోలీసులు అవతలి వ్యక్తి నుంచి మీ డబ్బును తిరిగి ఇప్పిస్తారు.
ఇలా ఫిర్యాదు చేసేప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడీ, వర్చువల్ పేమెంట్ అడ్రస్ (VPA), పంపిన మొత్తం, తేదీ, సమయం, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ వివరాలు ఇవ్వాలి.ఈ విధంగా మీరు చర్యలు తీసుకుంటే, మీ డబ్బు తిరిగి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కాబట్టి డిజిటల్ లావాదేవీల్లో జాగ్రత్తగా వ్యవహరించండి.పొరపాటుగా డబ్బు పంపితే కంగారు పడకుండా సరైన చర్యలు తీసుకుని మీ డబ్బును సురక్షితంగా తిరిగి పొందండి.