సూర్యాపేట జిల్లా:మట్టిరోడ్డుకు కూడా నోచుకోని గ్రామం.ఇక్కడి నుండే ఐదారు గ్రామాల ప్రజల రాకపోకలు.
మండలంలో తారురోడ్డు లేని ఏకైక గ్రామం.ప్రతీ ఎన్నికల సమయంలో తారురోడ్డు హామీ.
ఎన్నికలయ్యాక ఇటు తిరిగిచూడని ప్రజాప్రతినిధులు.వర్షంకాలం వస్తే వణికి పోతున్న ప్రజలు, వాహనదారులు.
ఇది ఓ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి దుస్థితి.
స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు గడిచినా,తెలంగాణ స్వరాష్ట్రం ఆవిర్భవించి 8 ఏళ్ళు నిండినా,పాలకులు, ప్రభుత్వాలు,స్థానిక ప్రజాప్రతినిధులు మారినా ఇక్కడి ప్రజల తలరాతలు మాత్రం మారలేదు.
తెలంగాణ రాష్ట్రంలో అయినా తమ బతుకులు మారుతాయని ఆశగా ఎదురు చూసిన ఈ గ్రామ ప్రజల ఆశలు ఈ ఎనిమిదేళ్లలో ఆవిరయ్యాయి.బంగారు తెలంగాణలో ఊరి బాట కూడా మారని దయనీయ దుస్థితిలో ఉన్న మునగాల మండలం నర్సింహాపురం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి,ఇన్నేళ్ల పాలకుల నిర్లక్ష్యాన్ని ప్రతి వర్షాకాలం ఎత్తి చూపుతూ వెక్కిరిస్తుంది.
మునగాల మండలంలోని 65వ జాతీయ రహదారిపై ఉన్న ఆకుపాముల గ్రామం నుండి నర్సింహాపురం గ్రామానికి వెళ్ళడానికి సుమారు 3 కి.మీ.మట్టి రోడ్డు ఉంది.కోదాడ నియోజకవర్గ పరిధిలో సరైన రోడ్డు సౌకర్యం లేని ఏకైక గ్రామం ఇదే అంటే అతిశయోక్తి కాదేమో.
ఇక్కడి ప్రజలు మండల కేంద్రం మునగాల, జిల్లా కేంద్రం సూర్యాపేట,నియోజకవర్గ కేంద్రం కోదాడకు వెళ్లాలన్నా ఈ మట్టి రోడ్డే ప్రధాన ఆధారం.కానీ,ఈరోడ్డు అడుగులోతు పెద్ద పెద్ద గుంటలతో నిండి ఉంటుంది.
ద్విచక్ర వాహనాల సంగతి దేవుడెరుగు కనీసం కాలి నడకన వెళ్లే పాదచారులు పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుంది.ఇక వర్షాకాలంలో అయితే గ్రామ ప్రజలు ఈ దారిని మరిచిపోవాల్సిందే అంటే ఆశ్ఛర్య పడాల్సిన అవసరం లేదు.
వర్షాలకు గుంతలు నిండి,బురదమయంగా తయారై వాహనదారులు ప్రమాదాలకు గురైన దాఖలాలు కోకొల్లలుగా ఉన్నాయి.ఈ దారి నుంచి ప్రయాణం చేయలేక పక్కనే ఉన్న కట్టకొమ్ముగూడెం నుంచి వయా కోదాడ నేషనల్ హైవే 65పై తిరిగి ఆకుపాముల రావడానికి ఏడెనిమిది కి.మీ.దూరం అదనంగా ప్రయాణించి మునగాల మండల కేంద్రానికి రావాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రతీ ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చే ప్రతీ నాయకుడు నర్సింహాపురం రోడ్డును తారురోడ్డుగా మారుస్తానని హామీ ఇవ్వడం పరిపాటిగా మారిందని,ఓడినవారు ఎలాగో పట్టించుకోరు,గెలిచిన వారు కూడా తిరిగి చూడకపోవడంతో గ్రామ ప్రజలు నిత్యం సమస్యలతో సహవాసం చేస్తున్నామని ఆందోళన చెందుతున్నారు.కేవలం నర్సింహాపురం ప్రజలే కాదు,ఎన్నో గ్రామాల ప్రజలు ఈ దారినే ప్రయాణం చేస్తుంటారని అందరూ ఇదే బాధ పడుతున్నారని చెబుతున్నారు.
ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు,ప్రజాప్రతినిధులు మా గ్రామ ప్రజల పరిస్థితిని అర్థం చేసుకుని ప్రస్తుతానికి కనీసం మరమ్మత్తులైనా చేసి,ఇక్కడ ప్రజల కష్టాలు తొలగించాలని కోరుకుంటున్నారు.