సూర్యాపేట జిల్లా:అధికార పార్టీ నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకుని ఎడ్ల పందేలను నిర్వహిస్తున్నారని,ఎస్పీ టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారికి అనుకూలంగా,ఖాకీ చొక్కాకు బదులుగా గులాబీ చొక్కా వేసుకొని పనిచేస్తున్నారని నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లా ఎస్పీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.మంగళవారం మహాశివరాత్రి సందర్బంగా మేళ్లచెరువు మండల కేంద్రంలోని శ్రీ స్వయంభు లింగేశ్వరస్వామి ఆలయానికి తన సతీమణి కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతితో వచ్చి దర్శించుకున్నారు.
ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక అర్చనలు పూజలు నిర్వహించారు.అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అధికారం చేతిలో ఉందని పోలీసులను ఉపయోగించి పండగలా జరుపుకునే మహాశివరాత్రి జాతరను రాజకీయం చేశారని మంత్రి జగదీష్ రెడ్డి,హుజుర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డిలపై ఎంపీ ఉత్తమ్ నిప్పులు చెరిగారు.
లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన జిల్లా ఎస్పీ గులాబి చొక్కా వేసుకుని అధికార పార్టీ వ్యక్తిగా పని చేస్తున్నారని విమర్శించారు.రాజకీయాలకతీతంగా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పిన ఎస్పీ తనను ఆహ్వానిస్తానని చెప్పి ఆహ్వానించకుండానే ఎడ్ల పందేలను మొదలుపెట్టారని అన్నారు.
టీఆర్ఎస్ పార్టీ నాయకులు కావాలనే రాజకీయ బుద్ధి బలం చూయించి జాతరలో తనను అవమానపరచాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఎడ్ల పందాలకు ఎస్పీ అనుమతి ఇవ్వలేదని,ఎస్పీ అధికార పార్టీకి అనుకూలంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
శాశ్వతంగా కేసీఆర్,సైదిరెడ్డిలు ఉండరని పోలీసులు గుర్తుంచుకోవాలని అన్నారు.కొంతమంది పోలీసులు న్యాయంగా,నిజాయితీగా ఉంటారని,కొందరు మాత్రం రాజకీయ రంగు పూసుకుని పని చేయడం మంచిది కాదని పేర్కొన్నారు.
జాతర ముగిసిన తర్వాత ఆలోచించి పోలిసులపై ఉన్నతాధికారుల ఫిర్యాదు చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలు చేస్తామని అన్నారు.