ఆహ్లాదంతో పాటు ఆధ్యాత్మికత ఉట్టి పడేలా సాగుతున్న స్మశాన వాటిక నిర్మాణాలు.మైండ్ స్పేస్,ఐటీ కారిడార్ లను తలపించేలా నిర్మితమవనున్న హిందూ వైకుఠదామ ముఖ ద్వారం.
మూడు కోట్ల 95 లక్షల వ్యయంతో జరుగుతున్న ఆధునీకరణ పనులను పర్యవేక్షించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి.ఆగస్టు లోపు పనులు ఆధునీకరణ పనులు పూర్తి చేయాలని ఆదేశం.
సూర్యాపేట జిల్లా:సహజంగా మన ఆత్మీయులో, బంధువులో మనకు దూరమైనప్పుడు తప్పనిసరిగా స్మశానం దగ్గరకు వెళ్తాం.అయిష్టంగానే అక్కడి పరిసరాలను చూస్తూ కార్యక్రమాలు పూర్తికాగానే తిరిగిచూడకుండా వెళ్లిపోతాం.
మళ్లీ మళ్లీ అక్కడకు వెళ్లాలని ఎవరూ అనుకోరు,కోరుకోరు అదే స్మశానం.కానీ,సూర్యాపేట సద్దుల చెరువు టాంక్ బండ్ దిగువన నూతనంగా నిర్మితమవుతున్న హిందూ వైకుంఠ ధామం భూతల స్వర్గాన్ని తలపించేలా ముస్తాబవుతుంది.
సూర్యాపేట శాసన సభ్యులు,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పర్యవేక్షణలో ఒకసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలన్నంత అందంగా,ఆహ్లాదంగా,ప్రశాంతంగా మున్సిపల్ అధికారులు తీర్చిదిద్దుతున్నారు.ఇక్కడకు ఒకసారి వెళ్లిచూస్తే స్మశాన వైరాగ్యం స్థానే ఆకర్షణగా అనిపిస్తుంది.
మళ్లీ మళ్లీ వచ్చి చూడాలన్నంత అందంగా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా మంత్రి జగదీశ్ రెడ్డి దీనికి సంబంధించిన ప్రతి అంశాన్ని జాగ్రత్తగా డిజైన్ చేయించారు.ప్రతి మనిషి అంతిమ సంస్కారం గొప్పగా జరగాలన్న ఆలోచనతో అంత్యక్రియలు జరిగే ప్రదేశం గౌరవప్రదంగా పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలన్న యోచనతో ప్రతి అంశంలో మంత్రి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మున్సిపల్ చైర్మన్ పెరుమాళ అన్నపూర్ణ,వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, మున్సిపల్ అధికారులతో కలసి మూడు కోట్ల 95 లక్షల వ్యయంతో సాగుతున్న హిందూ వైకుంఠ ధామం నిర్మాణ పనులను మంత్రి గురువారం పరిశీలించారు.పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి నిర్మాణంలో పలు మార్పులను సంబంధిత కాంట్రాక్టర్లకు సూచించారు.
ఆగస్టు లోగా ఆధునీకరణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.ప్రజలు లోపలికి వెళ్లగానే పచ్చగా పరుచుకున్న పచ్చిక, రకరకాల చెట్లు స్వాగతం పలికేలా ఉండాలని,దానికి తగిన విధంగా పార్క్ ను తలపించేలా వైకుంఠ దామాన్ని తీర్చి దిద్దాలని కొరారు.
ఇరవై అడుగుల ఎత్తున ధ్యానముద్రలో ఉన్న పరమేశ్వరుని విగ్రహం, గోడలకు వర్ణచిత్రాలు,బంధువులు,ఆత్మీయులు వేచి ఉండడానికి కాసేపు కూర్చోడానికి అనువుగా షెడ్డు నిర్మాణం,పట్టణ జనాభాకు తగినట్టు నాలుగు దహన వాటికలు,వచ్చిన వారి వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు ఇలా ఇక్కడ అవసరమైన సకల సదుపాయాలు ఉండేలా నిర్మాణాలు సాగుతున్నాయి.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్యనరాయణరెడ్డి,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ,పెద్దగట్టు చైర్మన్ కోడి సైదులు యాదవ్,కౌన్సిలర్ బాషా,జిల్లా నాయకులు రామగిరి నగేష్,టీఆర్ఎస్ పట్టణ కో ఆర్డినేటర్ కీసర వేణుగోపాల్ రెడ్డి,టీఆర్ఎస్ వి కో ఆర్డినేటర్ ముదిరెడ్డి అనీల్,గుండపునేని కిరణ్,రమా కిరణ్,రఫీ తదితరులు పాల్గొన్నారు.