యాదాద్రి భువనగిరి జిల్లా:పేదరికం చదువుకు అడ్డుకాదని,కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని నిరూపించాడు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామానికి చెందిన నక్క గణేష్ అనే నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్ది.ఇటీవల విడుదల చేసిన నీట్ ఫలితాల్లో (హాల్ టికెట్ నెంబర్ 4220070010) 201483 ర్యాంక్ సాధించి సంగారెడ్డిలోని ఎమ్మెన్నార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్ కాలేజీలో ప్రభుత్వ సీటు సాధించాడు.
సాధారణ నిరుపేద పరిస్థితిలో అనేక సవాళ్లు దాటుకుని నక్క గణేష్ అత్యంత ప్రతిష్టాత్మక కళాశాలలో సీటు సాధించి తోటి విద్యార్థులకు ఒక స్ఫూర్తిగా నిలిచాడు.ప్రజ్ఞా పాటవాలు ఎవరి సొత్తు కాదని కృషితో ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని నిరూపించాడని గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
భవిష్యత్తులో వైద్యరంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.అద్భుతమైన టాలెంట్ ఉండి ఎంబీబీఎస్ సీటు సాధించినందుకు తల్లిదండ్రులుగా తమకు అత్యంత సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుందని తల్లిదండ్రులు నక్క లక్ష్మమ్మ,రామనరసయ్య ఆనందం వ్యక్తం చేశారు.
నక్క గణేష్ విద్యాభ్యాసం మొదటి నుండి నాలుగు తరగతుల వరకు రామన్నపేటలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో,ఐదవ తరగతి జనంపల్లి ప్రైమరీ స్కూల్లో,ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు తుంగతుర్తి గురుకుల పాఠశాలలో, ఇంటర్మీడియట్ సర్వేల్ గురుకుల కళాశాలలో కొనసాగింది.ఎంబీబీఎస్ సీటు సాధించినందుకు జనంపల్లి గ్రామ పెద్దలు మరియు బంధువులు నక్క యాదయ్య,నక్క నరేందర్,నక్క అంజయ్య, నక్క ప్రవీణ్ తదితరులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.