సూర్యాపేట జిల్లా:సిపిఐ పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.సోమవారం జిల్లా కేంద్రంలో కామ్రేడ్ ధర్మ భిక్షం భవనంలో నిర్వహించిన పట్టణ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ సమితి పిలుపులో భాగంగా సంవత్సరం కాలం పాటు పల్లె పల్లె ఎర్రజెండా ఎగరవేసి కమ్యూనిస్టు పార్టీ పోరాట చరిత్రను భావితరాలకు తెలిసే విధంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
బ్రిటిష్ సామ్రాజ్య వాదులను ఈ దేశం నుండి తరిమేసేందుకు సాగిన స్వతంత్ర సమరశీల పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ అశేష త్యాగాలను చేసిందని, నిజాం నిరంకుశ పాలనకు అంతమొందించేందుకు సమరశీల పోరాటాలు చేసిందని గుర్తు చేశారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపించి 4 వేల గ్రామాలకు విముక్తి చేసి పది లక్షల ఎకరాలు భూములను చర నుండి విడిపించి పేదలకు పంచిన ఘనత భారత కమ్యూనిస్టు పార్టీదని కొనియాడారు.2025 సభ్యత్వం చేర్పింపు, పునరుద్ధరణ లక్ష్యాలను పూర్తి చేసి గ్రామస్థాయి మండలం స్థాయి,ప్రజా సంఘాల మహాసభలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని కోరారు.డిసెంబర్ 30 న నల్లగొండలో జరిగే శత జయంతి ఉత్సవాల బహిరంగ సభకు సూర్యాపేట జిల్లా నుంచి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
గుగులోతు రాజారామ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు,పార్టీ సీనియర్ నాయకులు బొమ్మగాని శ్రీనివాస్, చివ్వెంల మండల పార్టీ కార్యదర్శి ఖమ్మంపాటి రాము,పట్టణ కౌన్సిల్ సభ్యులు నిమ్మల ప్రభాకర్,రేగటి లింగయ్య, ఎడెల్లి శ్రీకాంత్,బూర సైదులు,పెన్డ్రా కృష్ణ,గాలి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.