సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సూచనల మేరకు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో రైతులకు మద్దతుగా నిరసన దీక్ష చేపట్టారు.సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో వరికి మద్దతు ధర కల్పించే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 48 గంటల నిరసన దీక్ష చేపట్టనున్నట్లు టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డి ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో కొనుగోలుదారులు ఆడింది ఆటగా పాడింది పాటగా తయారైందని అన్నారు.శుక్రవారం మంచి రకాలకు రూ.1800 చెల్లించిన మిల్లర్లు,శనివారం రూ.1200 మధ్య ధర పలకడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.శనివారం రోజు మొత్తం రైతులు ఆందోళన చేపట్టినా కనీసం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ మార్కెట్ ను సందర్శించలేదని అన్నారు.మిల్లర్లతో చైర్పర్సన్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు.శనివారం రోజున కలెక్టర్ మార్కెట్లో సందర్శించి పది,యాభై రూపాయలు మద్దతు ధర కల్పిస్తామని అనడం విడ్డూరంగా ఉందని అన్నారు.60 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి టిఆర్ఎస్ పాలనలో జరిగిందని చెప్పుకోవడం టిఆర్ఎస్ నాయకులకే చెల్లిందని ఎద్దేవా చేశారు.నాడు ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించారని గుర్తు చేశారు.ధాన్యాన్ని మీరు కొనాలంటే మీరు కొనాలని బిజెపి,టిఆర్ఎస్ దొంగనాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రైతు నలిగిపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.నియోజకవర్గ రైతుల ఓట్లతో నెగ్గిన మంత్రి జగదీశ్ రెడ్డి జోక్యం చేసుకొని రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో మరింత ఆందోళనకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రేస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.