సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతుందంటున్న నాయకుల మాటలు వేదికలపై ఉపన్యాసాలకు మాత్రమే పనికొస్తున్నాయని,సమస్యలపై పలుమార్లు అధికారులు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యమని,గ్రామ సమస్యలు పరిష్కరించాలంటూ అర గుండుతో,అర్ధనగ్నంగా ఓ గ్రామ ఉపసర్పంచ్ వినూత్న నిరసన తెలిపాడు.వివరాల్లోకి వెళితే మఠంపల్లి మండలకేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న గ్రామపంచాయతీ అవిరేణికుంట తండా.
గ్రామంలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉప సర్పంచ్ చీనా నాయక్ బుధవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు అరగుండుతో,అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేసి ఎంపీడీవోకి వినతి పత్రం సమర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీలో అక్రమాలు జరిగాయని,మంచినీటి సమస్యపై సర్పంచ్,పంచాయతీ సెక్రెటరీ పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
ప్రభుత్వ జీవో ప్రకారం గ్రామపంచాయతీ సిబ్బందిని పాలకవర్గం అనుమతితో నియమించాలి.కానీ,అది జరగలేదని సర్పంచ్ కుటుంబ సభ్యులనే తను ఇష్టారాజ్యంగా నియమించారని అన్నారు.
గ్రామపంచాయతీలో సిబ్బంది కూడా పనిచేయడం లేదని,గతంలో పంచాయితీ అక్రమాలపై విచారణ జరిపి ఎలాంటి చర్యలు చేపట్టలేదని,డిఎల్పిఓ విచారణలో అక్రమాలు తేలినా నేటికీ చర్యలు తీసుకోలేదన్నారు.ఇదే విషయాన్ని పంచాయతీరాజ్ అధికారులకు వివరించినా స్పందించడం లేదని, పంచాయతీ కార్యదర్శి విధులకు సరిగా హాజరు కావడం లేదని,పన్నుల రసీదు బుక్ లో ఒకటి నుండి 100 పేజీలు మాయం చేశారన్నారు.
తీగల చెరువు నుండి తండా వరకు బిటి రోడ్డు ఏర్పాటు చేయాలని,8 ఏళ్ల కింద మంజూరైన జాన్ పహాడ్ రోడ్డు నుండి అవరేణికుంట తండా బీటీ రోడ్డు పనులు ప్రారంభించాలని నియోజకవర్గ శాసనసభ్యులకు వివరిస్తూ వినతి పత్రంలో పేర్కొన్నట్టు తెలిపారు.