ఆసరా పెన్షన్లతో వృద్ధులను,వికలాంగులను,ఒంటరి మహిళలను,గీత, నేత,బీడీ కార్మికులను తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని చెబుతున్న ప్రభుత్వ పెద్దలకు నిజమైన అర్హులు ఎందుకు కనిపించడం లేదని సూర్యాపేట జిల్లా మోతె మండలం హుస్సేనాబాద్ ( Hussainabad )గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.ఎలాంటి స్థిర చరాస్తులు లేకుండా కూలీనాలీ చేసుకుంటూ బ్రతికే కనుకు లచ్చయ్య కుమారుడు కనుక వెంకన్న అలియాస్ పిచ్చయ్య(20) పసి వయస్సు నుంచే మానసిక వికలత్వంతో బాధపడుతూ ఇరవై ఏళ్ళు వచ్చినా ఎదుగుబొదుగు లేకుండా ఉండడంతో వెంకన్న కాస్త పిచ్చయ్యగా పేరును మోస్తూ గ్రామంలో ఇంటింటి తిరిగి భిక్షాటన చేస్తూ దయనీయంగా జీవిస్తున్నాడు.
తండ్రి మరణించడంతో తల్లి అమాయకురాలు కావడంతో కనీసం అతనికి ఆసరా పెన్షన్ కోసం సదరన్ సర్టిఫికెట్ కు దరఖాస్తు చేసుకునే స్థితి కూడా లేకపోవడం గమనార్హం.దీనితో ప్రభుత్వ ఆసరా పెన్షన్ కి పూర్తిస్థాయి అర్హుడైన పిచ్చి వెంకన్నకు ప్రభుత్వం నుంచి ఆసరా సహాయం అందలేదు.
ఇతని,ఇతని కుటుంబ పరిస్థితి తెలిసినా స్థానిక ప్రజా ప్రతినిధులు కనీసం ఇతనికి సదరన్ సర్టిఫికెట్ఇ ప్పించి,పెన్షన్ ఇప్పించాలనే సోయి లేకపోవడం బాధాకరమని గ్రామస్తులు వాపోతున్నారు.అన్ని ఉన్నవారికి ఆసరా పెన్షన్ ఇస్తున్న అధికారులకు ఇతని దయనీయ గాథ కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని అంటున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి తండ్రి ఈ మానసిక వికలాంగుడిని ఆసరా పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని కోరుతన్నారు.