రజినీకాంత్ హృతిక్ రోషన్ లాగా అందంగా లేకపోయినా, సల్మాన్ ఖాన్ లాగా కండలు పెంచకపోయినా, అమితాబ్ బచ్చన్ లాగా ఆరడుగుల ఎత్తు లేకపోయినా.భారతీయ చలనచిత్ర రంగంలో సూపర్ స్టార్ హీరో అయ్యి ఆశ్చర్యపరిచారు.
ఆయన నడిచే తీరు, డైలాగులు చెప్పే విధానం, మొహంపై పలికించే హావభావాలు ప్రేక్షకులను వెండితెరకు కట్టిపడేస్తాయి అంటే అతిశయోక్తి కాదు.ఈ బాషా ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టు అతిగా ఆశ పడే ఆడది ,అతిగా ఆవేశపడే మగాడు సుఖపడినట్టు చరిత్రలో లేద అంటూ ఆయన చెప్పిన డైలాగులు ఎవరూ మర్చిపోలేరు.
ఐతే సినిమాలలో కళ్ళద్దాలు పెట్టుకుని చాలా స్టైలిష్ గా కనిపించే రజినీకాంత్ నిజజీవితంలో చాలా సాదాసీదాగా ఉంటారు.ఆయన ఎంత సాదాసీదాగా ఉంటారో తెలుసుకుంటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.
ఈ ఆర్టికల్ లో రజనీకాంత్ సింప్లిసిటీకి అద్దంపట్టే కొన్ని ఘటనల గురించి తెలుసుకుందాం.

ఒకరోజు బెంగళూరు లోని ఓ గుడి గట్టు మీద ఒంటరిగా కూర్చొని రజినీకాంత్ సేద తీరుతున్నారు.ఆ సమయంలోనే అదే గుడికి వచ్చిన ఒక మహిళ రజినీకాంత్ వేషధారణ చూసి ఆయన్ని బిచ్చగాడు అనుకొని పది రూపాయల కాగితాన్ని చేతిలో పెట్టింది.ఐతే కాసేపటికి రజినీకాంత్ బయటకి వచ్చి కారు ఎక్కుతుంటే ఆమె ఆశ్చర్యపోయి చూస్తూ ఏంటి బిచ్చగాడికి కారు ఉంది? అని ఆమె రజినీకాంత్ వైపు తదేకంగా చూసింది.అప్పుడు తాను బిచ్చగాడు అని పొరపాటు పడిన వ్యక్తి మరెవరో కాదు సూపర్ స్టార్ రజనీకాంత్ అని ఆమె తెలుసుకున్నారు.
వెంటనే రజినీకాంత్ వద్దకు వచ్చి క్షమాపణ కోరారు.అయితే ఈ సంఘటనను తాను ఎప్పుడూ మర్చిపోలేనని రజనీకాంత్ చెబుతుంటారు.స్టార్ డమ్, మేకప్ లేకపోతే తానేంటో గుడి సంఘటన తనకు ఎప్పుడూ గుర్తు చేస్తుందని రజినీకాంత్ అంటుంటారు.ఈ సంఘటన బట్టి రజినీ ఎంత సింపుల్ గా ఉంటారో ఊహించవచ్చు.
దళపతి సినిమా షూటింగ్ సమయంలో కూడా రజినీకాంత్ ఎంత నిరాడంబరంగా ఉంటారో బయటపడింది.ఒకరోజు రాత్రి షూటింగ్ పూర్తి చేసుకున్న అరవింద్ స్వామి నిద్ర పోవాలని అనుకున్నారు.
అప్పుడే ఆయనకు ఒక ఎ.సి గది, డబల్ కాట్ మంచం కనిపించింది.దీంతో ఆయన వెంటనే ఎ.సి గదిలోకి వెళ్ళి డబల్ కాట్ మంచం లో పడుకున్నారు.నిజానికి ఆ రూమ్ రజినీకాంత్ కోసం ప్రత్యేకంగా చిత్ర బృందం ఏర్పాటు చేసింది.దీంతో రజినీకాంత్ షూటింగ్ ముగించుకుని తన రూమ్ కి రాగా అక్కడ అరవింద్ స్వామి నిద్రపోతూ కనిపించారు.
అప్పుడు రజినీకాంత్ అసిస్టెంట్ డైరెక్టర్లను పిలిచి అరవింద్ ని లేపి నిద్ర చెడగొట్టొద్దని చెప్పి ఆయన అక్కడే నేలపై పడుకున్నారు.తెల్లారేసరికి అరవింద్ లేవగా ఆయనకు నేలపై పడుకుని ఉన్న రజినీకాంత్ కనిపించారు.
ఈ దృశ్యం చూడగానే షాక్ అయిన అవింద్ రస్వామి వెంటనే బయటకు వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్లను ఏమైంది అని అడిగారు.దీంతో వారు అసలు విషయం చెప్పగా రజినీకాంత్ యొక్క గొప్ప హృదయానికి, సింప్లిసిటీ కి అరవింద్ స్వామి ఫిదా అయిపోయారు.

స్టయిల్ కి మారుపేరైన రజినీ నిజజీవితంలో ధోతీ, కుర్తా వంటి సాధారణ దుస్తులు ధరిస్తారు.ఇంట్లో ఉంటే లుంగీ, హవాయి చెప్పులు తప్పించి మిగతా ఏ హంగు ఆర్భాటాలకు పోరు.తలకి విగ్ పెట్టుకోవడం గానీ జట్టుకి నల్ల రంగు వేసుకోవడం గాని రజనీకాంత్ కి అస్సలు నచ్చదు.అభిమానులను సంతోష పెట్టడం కోసమే తాను సినిమాల్లో చాలా స్టైలిష్ గా కనిపిస్తానని రజిని చెబుతుంటారు.రా.1 సినిమాలో అతిధి పాత్రలో నటించినందుకు గాను రజినీకాంత్ కి బీఎండబ్ల్యూ కారు కొనిస్తానని షారుక్ ఖాన్ మాట ఇచ్చారట.కానీ తనకు లగ్జరీ కార్లలో తిరగడం అసలు ఇష్టం లేదని చెప్పి షారుక్ ఖాన్ బహుమతిని రజినీ తిరస్కరించారట.
అప్పట్లో రజినీకాంత్ తన పుట్టిన రోజును అభిమానుల సమక్షంలో చేసుకునేవారు.
కానీ ఒకరోజు చెన్నైలో రజినీకాంత్ బర్త్ డే వేడుకలు జరుగుతుండగా ముగ్గురు అభిమానులు తొక్కిసలాటలో చనిపోయారు.దీంతో రజనీకాంత్ ఎంతో బాధ పడ్డారు.ఆ తర్వాత చెన్నైలో పుట్టినరోజు జరుపుకోకూడదని నిర్ణయించుకున్నారు.అయితే రజనీకాంత్ వాణిజ్య ప్రకటనల్లో కూడా నటించరు.
ఏది ఏమైనా అందరి స్టార్ హీరోలకు భిన్నంగా రజినీకాంత్ తన జీవితాన్ని కొనసాగించడం నిజంగా ప్రశంసనీయం.