సూర్యాపేట జిల్లా:మునగాల మండలం రేపాల గ్రామంలోని గుట్టపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు నేడు కన్నులపండువగా ప్రారంభమయ్యాయి.తెల్లవారు జామున స్వామి వారిని సిరిపురం నుండి తీసుకొని వచ్చి గ్రామ పురవీధులలో మేళ తాళాలతో,కోలాట,భజనలతో ఊరేగించారు.
గ్రామ ప్రజలు,భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారికి తోరణాలతో పూలతో, హారతులిచ్చి,టెంకాయలు కొట్టి ఘనంగా స్వాగతం పలికారు.ఊరేగింపు అనంతరం స్వామి వారు గుట్టపై గల ఆలయానికి చేరుకొన్నారు.
నేటి నుండి ఈ నెల 21 వరకు 10 రోజుల పాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని ఆలయ కమిటీ చైర్మన్ పోనుగోటి రంగా,ఆలయ అర్చకులు చివలూరి రామకృష్ణాచార్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు,గ్రామ పెద్దలు,మహిళలు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.