సూర్యాపేట జిల్లా:కోదాడ మండలం కాపుగల్లులో మట్టి మాఫియాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.అక్రమ మైనింగ్ చేస్తున్నారని మీడియా,సోషల్ మీడియా గగ్గోలు పెడితే ఈ నెల 26న మైనింగ్ శాఖా అధికారులు ఆకస్మిక తనిఖీ చేసి మైనింగ్ జరగకుండా సంబంధిత క్వారీలను సీజ్ చేసి వెళ్ళిపోయారు.
దీనితో రెండు రోజులు సైలెంట్ గా ఉన్న మట్టి మాఫియా రాబంధులు మళ్ళీ సోమవారం నుండి అక్రమ మైనింగ్ కు తెరలేపారు.అధికారులు సీజ్ చేస్తే మాకేం భయం అన్నట్లుగా తెగబడి యథేచ్చగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు.
ఈ విషయం తెలిసినా మైనింగ్ అధికారులు మాత్రం వారిని కట్టడి చేయలేక చేతులెత్తేసి చోద్యం చూస్తున్నారు.ఒకసారి అక్రమమని సీజ్ చేసిన క్యారీలో ఎవరి అండ చూసుకుని ఇంత ధైర్యంగా అక్రమ మైనింగ్ కు పాల్పడుతూ చెలరేగి పోతున్నారని స్థానికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
మట్టి మాఫియాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని,తూతూ మత్రంగా చర్యలు తీసుకోవడం వల్లనే వారికి భయం లేకుండా పోయిందని, జరుగుతున్న పరిణామాలు చూస్తే మట్టి మాఫియాకు అధికారులకు లోపాయికారి ఒప్పందం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయని అంటున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు సీరియస్ గా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.