సూర్యాపేట జిల్లా:స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా అధికార పార్టీకి చెందిన కోదాడ మున్సిపల్ చైర్మన్ తనకు సొంత పార్టీ నేతల నుండే అవమానం జరిగిందంటూ మీడియా ముందు బోరుమంటూ విలపించడం చర్చనీయాంశంగా మారింది.తనకు జరిగిన అవమానం పట్ల నిరసన తెలిపిన చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ అనంతరం పట్టణంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పట్టణ ప్రథమ పౌరురాలని కూడా చూడకుండా అవమానాలకు గురిచేస్తున్నారని,ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్,జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డిలు తన క్షోభను అర్థం చేసుకోవాలంటూ వేడుకుంది.మహిళా ప్రజాప్రతినిధిగా,పట్టణ ప్రథమ పౌరురాలిగా గాంధీ పార్కులో జరిగే వేడుకలకు హాజరు కాగా కొబ్బరికాయలు కొట్టే విషయంలో మండల మహిళా ప్రజాప్రతినిధి చింత కవితా రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి ఇరువురు తనను నెట్టివేసి అవమానపరచడం చాలా బాధాకరంగా ఉందన్నారు.
తమ కుటుంబం వ్యవసాయ,విద్యా పరంగా సరైన వారమని చెప్పి జనరల్ స్థానంలో బీసీ మహిళగా తనకు పార్టీ అవకాశం ఇచ్చిందన్నారు.కానీ,చైర్ పర్సన్ గా బాధ్యతలు తీసుకున్న నాటి నుండి నేటి వరకు మా విధులను నిర్వహించుకోకుండా అధికార, అనధికార వ్యక్తులచే అడ్డు తగులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తమను భయభ్రాంతులకు గురి చేస్తూ ఎమ్మెల్యే మా విధులను నిర్వహించకుండా ప్రతిసారి అడ్డు తగులుతున్నారని ఆరోపించారు.తమకు ఏమాత్రం విలువ లేకుండా చేస్తూ ప్రేక్షక పాత్రకే పరిమితం చేస్తున్నారని రోధిస్తూ చెప్పారు.
మున్సిపాలిటీ పరిధిలో జరిగే అధికార,అనధికార కార్యక్రమాలన్నింటిలో మండల మహిళా ప్రజా ప్రతినిధికి జోక్యం కల్పిస్తూ పాలకవర్గంలో చీలికలు తెస్తూ అభాసుపాలు చేస్తున్నారని ఆరోపించారు.పట్టణంలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో తమ ఫోటోలు వేయకుండా రాజకీయ దురుద్దేశంతో కించపరుస్తున్నారని అన్నారు.
సున్నితమైన మనస్తత్వం కలిగిన తనకు తన భర్త తోడుగా వస్తుంటే తన భర్తను రానివ్వకుండా అడ్డుకోవడం చాలా బాధాకరం అన్నారు.భర్తగా భార్యకు తోడు రావడం తప్ప అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్,కేటీఆర్.జగదీశ్ రెడ్డిలు తాను అనుభవిస్తున్న మానసిక క్షోభను అర్థం చేసుకొని మా విధులను సక్రమంగా నిర్వహించే విధంగా చూడాలన్నారు.
కాగా ఆమె అవమానాలు భరించలేక చివరకు అన్న మల్లన్న ఒక సోదరిగా వేడుకుంటున్నా అన్న ఒక మహిళపై కక్ష కట్టి నన్ను నా భర్తను అవమానిస్తూ మాకు మనశ్శాంతి లేకుండా చేయకండి అన్నా అంటూ కన్నీటి పర్వతమయ్యారు.ఈ సమావేశంలో కౌన్సిలర్లు తీపిరిశెట్టి సుశీల రాజు, మదార్,స్వామి నాయక్,గుండపునేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.