సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే చొరవ చూపాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు.శనివారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం తిరుమలగిరి గ్రామంలో వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో చెరువులోకి దిగి సంఘం నేతలతో కలిసి జల దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వస్తే తమ బతుకులు బాగుపడతాయని భావించామని,అయినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
పాఠశాల మెట్లు ఎక్కలేని వైకల్యాన్ని సైతం జయించి డిగ్రీలు పీజీలు పూర్తిచేశామని, రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ పోరాడిన వికలాంగుల జాతి బిడ్డల వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగుల భర్తీ విషయంలో చిన్న చూపు తగదని అన్నారు.రాష్ట్రంలో దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగుల సమాజానికి దళిత బంధు తరహాలోని రూ.15 లక్షలతో వికలాంగుల బంధు పథకానికి రూపకల్పన చేయాలని గత డిసెంబర్ 3న వికలాంగుల సంఘాల పోరాటాలు చేస్తే, వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేస్తున్నామని ప్రకటన చేసి
నేటి వరకు ప్రత్యేక అధికారుల నియామకం చేపట్టలేదని విమర్శించారు.కుల సంఘాల భవనాల మాదిరిగానే రాష్ట్ర రాజధాని కేంద్రంగా మరియు అన్ని జిల్లా కేంద్రాల్లో వికలాంగుల భవనాలు,వికలాంగుల హాస్టల్లు నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.వికలాంగుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే చొరవ చూపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు, జిల్లా ఉపాధ్యక్షుడు మున్న మధు యాదవ్,మండల అధ్యక్షుడు కొల్లూరి నాగరాజు,శివ,అశోక్, పావని,సరిత తదితరులు పాల్గొన్నారు.