సూర్యాపేట జిల్లా:రాష్ట్రంలో పలు దిన పత్రికలలో, ఎలక్ట్రానిక్ మీడియాలలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని,జర్నలిస్టులను వారి కుటుంబాలను విస్మరించొద్ధని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణలకు సోషల్ మీడియా వేదికగా లేఖలు రాశారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో జర్నలిస్టులది కీలక పాత్రన్న సంగతి మర్చిపోవద్దని పేర్కొన్నారు.
ఎలాంటి వేతనాలు లేకుండా ప్రభుత్వ ప్రజా సేవ చేస్తున్న నిజమైన సేవకుడు జర్నలిస్టు మాత్రమేనని గుర్తుచేశారు.ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల మంది జర్నలిస్టులు పని చేస్తున్నారని వారి కుటుంబాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.
అన్ని జిల్లాల్లో జర్నలిస్టు భవన్ లు,మండల నియోజకవర్గాల్లో ప్రెస్ క్లబ్ భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా వర్కింగ్ లో ఉన్న ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలన్నారు.
ప్రత్యేక డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చి జర్నలిస్టు కుటుంబాలను ఆదుకోవాలన్నారు.ఎలాంటి ఖర్చు లేకుండా ప్రతి జర్నలిస్టు కుటుంబానికి అన్ని ఆస్పత్రుల్లో చెల్లుబాటయ్యే విధంగా హెల్త్ కార్డులు మంజూరు చేయాలన్నారు.
రాష్ట్రంలో జర్నలిస్టులపై అకారణంగా దాడులు చేస్తున్నారని జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరారు.భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగించొద్దని,జర్నలిస్టుకు పూర్తి స్వాతంత్య్రం ఇవ్వాలని అప్పుడే మంచి మంచి వార్తలు ప్రజలకు ప్రభుత్వానికి అందించే విధంగా కృషి చేస్తారని వివరించారు.
నూతన అక్రిడేషన్ కార్డుల జారీ ప్రక్రియను వెనువెంటనే ప్రారంభించాలని కోరారు.