సూర్యాపేట జిల్లా: గృహలక్ష్మి,డబుల్ బెడ్ రూమ్ కేటాయింపులలో అధికార పార్టీ నాయకుల అక్రమాలను అరికట్టాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జి ధర్మార్జున్ డిమాండ్ చేశారు.డబుల్ బెడ్ రూమ్ అక్రమాలను అరికట్టాలని అర్హులైన పేదలందరికీ గృహలక్ష్మీ పథకం వర్తింపచేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కు వినతిపత్రం సమర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రచారం చేసుకున్న డబుల్ బెడ్ రూమ్ పథకం ఇల్లు లేని నిరుపేదలకు ఎంతో ఆశ కల్పించింది.
కానీ,ఆ పేరుతో ఓట్లు వేయించుకొని చేతులెత్తేసి మళ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందుట కొరకు గృహలక్ష్మి పేరుతో సరికొత్త నాటకానికి తెరలేపిందని విమర్శించారు.
అర్హులైన పేదలకు ఇల్లు ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులు అనుచర గణానికి ఇల్లు కేటాయిస్తూ గ్రామాలలో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని, ఫలితంగా అసలైన అర్హులు నష్టపోతున్నారని, అర్హులైన పేదలందరికీ గృహలక్ష్మి పథకం వర్తింపజేయాలని కోరారు.డబుల్ బెడ్ రూం ఎంపిక పారదర్శకంగా జరగలేదని ఆరోపించారు.
డ్రా తీసే సమయంలో స్టేజి మీద ఆయా వార్డుల కౌన్సిలర్ లను అధికారులు అనుమతించడంతో ఎంపిక నిష్పాక్షికంగా జరగలేదని జిల్లా కలెక్టర్ వేదిక మీద లేకపోవడం, మున్సిపల్ కమీషనర్ ఆధ్వర్యంలో డ్రా జరగడంతో పలు అనుమానాలకు తావిస్తున్నదని అన్నారు.
కౌన్సిలర్లు ప్రభావితం చేశారని ఆరోపించారు.
కలెక్టర్ ఆధ్వర్యంలో తిరిగి డ్రా నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జనసమితి రాష్ట్ర కమిటి సభ్యులు గట్ల రమాశంకర్, పట్టణ పార్టీ అధ్యక్షులు బంధన్ నాయక్, ఎస్సి సెల్ జిల్లా కన్వీనర్ బచ్చలకూరి గోపి,మైనార్టీ సెల్ జిల్లా కన్వీనర్ రఫీ, విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షులు బొమ్మగాని వినయ్ గౌడ్,ఉపాధ్యక్షులు ఈశ్వర్ సింగ్,ఆత్మకూర్ (ఎస్) మండల పార్టీ అధ్యక్షులు కొల్లు కృష్ణారెడ్డి,చివ్వెంల మండల పార్టీ అధ్యక్షుడు సుమన్ నాయక్, సూర్యాపేట మండల పార్టీ కోఆర్డినేటర్ వల్కిరాజు, ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి జాతోతు శ్రీను,పట్టణ నాయకులు దొన్వాన్ కృష్ణ, ఫరేద్,గండమల్ల మహేష్, లక్ష్మీపార్వతమ్మ,లలిత తదితరుల పాల్గొన్నారు.