సూర్యాపేట జిల్లా: పంజాబ్ ముఖ్యమంత్రి ముఖ్యకారదర్శిగా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్నె గ్రామానికి చెందిన అరిబండి వేణుప్రసాద్ నియమితులయ్యారు.పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) కొత్తగా అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ నియామకం జరిగింది.
ప్రస్తుతం ఆయన పంజాబ్ రాష్ట్ర విద్యుత్ సంస్థ సీఎండీగా ఉన్నారు.సీఎం ముఖ్యకార్యదర్శిగానే కాకుండా సీఎండీగా కూడా ఆయన కొనసాగనున్నారు.
ఎక్సైజ్ అండ్ టాక్సేషన్ అదనపు బాధ్యతలను కూడా ఆయన చూస్తున్నారు.సమర్ధత కలిగిన అధికారిగా,కార్యదక్షత,మంచితనమే ఆయనకు ఈ గుర్తింపు తీసుకువచ్చింది.
పంజాబ్ వెలుగు మన “అరిబండి” అంటూ బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వవిద్యార్ధులు ఇటీవల ప్రచురించిన “వెలుగు పూలు” అరబండి వేణుప్రసాద్ కార్యదక్షతను చక్కగా వివరించింది.”వేణు తన పనితీరు,లక్ష్యాల సాధనతో మంచి పేరు తెచ్చుకున్నారు.
ఆదర్శవంతంగా పని చేస్తూ ఏ శాఖలో బాధ్యతలు నిర్వహిస్తే ఆ శాఖ ఉద్యోగులకు స్పూర్తి ప్రదాత అయ్యారు.తనపై నమ్మకం ఉంచి అప్పగించిన గురుతర బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించి అందరికీ తలలో నాలుక అయ్యారు.
క్రమశిక్షణ, సమయపాలన,నిజాయితీకి పెట్టింది పేరుగా, సమస్యల పరిష్కర్తగా పేరొందారని” తెలిపింది.బాపట్ల వ్యవసాయ కళాశాల నుంచి పంజాబ్ లో ప్రధాన కార్యదర్శి హోదాకు ఎదిగిన మొదటి వ్యక్తి అని “వెలుగు పూలు” అరబండి వేణు ప్రసాద్ పని తీరు,సమర్ధత గురించి వివరించింది.
అరిబండి రంగయ్య,మంగమ్మ దంపతులకు రెండో సంతానంగా వేణుప్రసాద్ 1964 లో జన్మించారు.ప్రాధమిక విద్య మునగాలలో,పదో తరగతి వరకూ ఖమ్మంలో చదివారు.
నాగార్జున సాగర్ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివారు.మెడిసిన్ చదవాలని ఉన్నా వెంట్రుక వాసిలో సీటు చేజారింది.దీంతో 1980 లో బాపట్ల వ్యవసాయ కళాశాలలో చేరారు.1991లో సివిల్స్ రాసి తన ఐఏఎస్ లక్ష్యాన్ని సాధించారు.గత ఏడాది డిసెంబర్లో పంజాబ్ రాష్ట్ర విద్యుత్ సంస్థలో అవిభక్త కవలలకు ఉద్యోగం ఇచ్చి మానవత్వం పరిమళించిన మూర్తిగా ఎందరికో ప్రేరణ ఇచ్చారు వేణుప్రసాద్.