సూర్యాపేట జిల్లా:గత నేల 27 తేదీన మైనింగ్ అధికారులు అక్రమంగా గ్రానైట్ ను తరలిస్తున్న 13 ట్రాలిలను సీజ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.సూర్యాపేట జిల్లా కోదాడ ( Kodada )మండల పరిధిలోని చిమిర్యాల గ్రామంలో మిడ్వెస్ట్ కంపెనీ గత నెల 27 వ తేదీన అనుమతులు లేకుండా కోట్లు విలువ చేసే గ్రానైట్ ను అక్రమంగా తరలిస్తుండగా మైనింగ్ అధికారులు సీజ్ చేసి కోదాడలోని మేళ్ళచెరువు రోడ్డులోని మై హోం సిమెంట్ యార్డుకు కోదాడ ఆర్టీఏ అనంతగిరి ఎస్ఐ సహాయంతో తరలించారు.
కోదాడ మండల పరిధిలోని చిమిర్యాల గ్రామ శివారులో గత కొన్ని సంవత్సరాలుగా మిడ్వెస్ట్ గ్రానైట్ పేరుతో క్వారీ నిర్వహిస్తున్నారు.మిడ్వెస్ట్ గ్రానైట్ వలన తమ ఇళ్లు రోడ్లు పూర్తిగా దెబ్బ తింటున్నాయని,బాంబు పేలుళ్ళు వలన తమ ఇళ్లు పగుళ్లు ఏర్పడుతున్నాయని పలుమార్లు గ్రామస్తులు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేశారు.
మిడ్వెస్ట్ గ్రానైట్ పై పలుమార్లు ఫిర్యాదులు వచ్చినా తూతూ మంత్రంగా తనిఖీలు చేపట్టి చేతులు దులుపుకున్నారనే విమర్శలు ఉన్నాయి.
మిడ్వెస్ట్ గ్రానైట్ ( Midwest Granite )కంపెనీ యాజమాన్యం తమకున్న ఆర్థిక,రాజకీయ పలుకుబడితో మొక్కుబడిగా తనిఖీలు చేపించి సంబంధిత అధికారులకు భారీగా ముడుపులు చెల్లించారనేఆరోపణలు కూడా ఉన్నాయి.
గత కొన్ని రోజుల క్రితం కూడా ఫిర్యాదుల పరిశీలనకు అధికారులు మిడ్వెస్ట్ గ్రానైట్ లో తనిఖీలు చేయడం గమనార్హం.మిడ్వెస్ట్ గ్రానైట్ కంపెనీపై పలు ఆరోపణలు వస్తున్నా గత కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా మైనింగ్ ను నిర్వహిస్తూ కోట్ల రూపాయలు పన్ను ఎగవేసి తమ జేబుల్లో నింపుకున్నారని,సంబంధిత అధికారులకు భారీగా ముడుపులు చెల్లిస్తూ తమ వ్యాపారానికి అడ్డు రాకుండా చేసుకున్నారనిఅంటున్నారు.
ఇప్పుడు ఏకంగా 13 వాహనాలను సీజ్ చేయడంతో ప్రజల ఆరోపణలకు బలం చేకూరినట్లు కావడంతోజిల్లా అధికారులు మిడ్ వెస్ట్ గ్రానైట్ పై ప్రత్యేక దృష్టి సారించి,పోలీస్, రెవెన్యూ,మైనింగ్ అధికారులు సంయుక్తంగా గత నెల 27 తేదిన అక్రమంగా గ్రానైట్ ను తరలిస్తున్న 13 ట్రాలీలు సీజ్ చేసినట్లు తెలుస్తుంది.మిడ్వెస్ట్ అక్రమాలకు నిదర్శనమే ఈ ట్రాలీలు పట్టుబడమని ప్రజలు అంటున్నారు.