సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో వికలాంగుల కోట ఎంతో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం,సీఎం రేవంత్ రెడ్డి తేల్చాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు.సూర్యాపేట జిల్లా, గరిడేపల్లి మండల కేంద్రం నిర్వహించిన ప్రపంచ వికలాంగుల దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ఉన్న వికలాంగులకు వెంటనే ఉచిత రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు,పెన్షన్ రూ.6000 అందజేయాలని,విడతల వారీగా అన్ని జిల్లాల్లోనూ వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల ఖాళీలను గుర్తించి వెంటనే భర్తీ చేయాలని,
రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు నూతన ముఖ్యమంత్రి కృషి చేయాలని కోరారు.గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా వికలాంగుల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి పాటుపడతారని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.
తమ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడే ముఖ్యమంత్రిగా రావడంతో తమ సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని భావిస్తున్నామని,నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి తమ సంఘం పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూనే తమ సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల వికలాంగుల సంఘం నేతలు పాల్గొన్నారు.