సూర్యాపేట జిల్లా: చంద్రబాబును తెలంగాణ నుంచి తన్ని తరిమేసామని, చంద్రబాబు తెలంగాణ ద్రోహి అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డిపై హుజూర్ నగర్ నియోజకవర్గ తెలుగుదేశం నేత మండవ వెంకటేశ్వర్లు గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు.శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగదీష్ రెడ్డి తెలంగాణ నీ అయ్య జాగీరా అంటూ ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీ తెలంగాణలోని పుట్టిందని, ఎన్టీఆర్,చంద్రబాబు హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.హైదరాబాద్ మహా నగరాన్ని అభివృద్ధి చేసింది,తెలంగాణ తలసరి ఆదాయం పెరగటానికి,మిగులు బడ్జెట్ ఉండటానికి చంద్రబాబు నాయుడు కారణమనే విషయాన్ని మరిచిపోతే ఎలా అని ప్రశ్నించారు.
తెలంగాణ ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చిన విషయం వాస్తవం కాదా అన్నారు.గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటమి చూసిన తర్వాత మీ నాయకుడు కెసిఆర్ తెలంగాణ ప్రజలకు మొహం చూపించలేక ఫామ్ హౌస్ కే పరిమితమయ్యాడని విమర్శించారు.
ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ మెప్పుకోసం జగదీష్ రెడ్డి చంద్రబాబుపై నోరు పారేసుకుంటున్నారని, ఎల్లకాలం సెంటిమెంట్ పనిచేయదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలపడుతున్న విషయాన్ని గ్రహించి, తెలుగుదేశం బలపడితే బిఆర్ఎస్ ఉనికి కోల్పోతుందనే అసహనంతో చంద్రబాబు నాయుడుని విమర్శిస్తున్నారన్నారు.
తెలంగాణలో పాలక పక్షమైన కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించకుండా తెలుగుదేశం అధినేత అయిన చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయటం ఏమిటని ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడుపై మరోసారి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో టిఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోశపతి,టౌన్ పార్టీ నాయకులు తమ్మిశెట్టి రాములు,బీసీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వంశీ,గరిడేపల్లి, మఠంపల్లి,మేళ్లచెరువు మండల పార్టీ అధ్యక్షులు కీసరి నాగయ్య ముదిరాజ్, బానోతు నాగేశ్వరావు నాయక్,మండల పార్టీ బుక్య బాలాజీ నాయక్,రౌతు కొండలు,నల్లగొండ పార్లమెంటు నాయకులు పోలాగాని సురేష్ గౌడ్, గరిడేపల్లి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు గౌడ్, టిఎన్టియుసి పట్టణ నాయకులు గుండెబోయిన వెంకన్న యాదవ్, యల్లావుల వెంకన్న యాదవ్ తదితతులు పాల్గొన్నారు.