సూర్యాపేట జిల్లా:చేనేత కార్మికులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావు,పద్మశాలి సంఘం అధ్యక్షులు అప్పం శ్రీనివాస్ అన్నారు.
ఆదివారం జిల్లా కేంద్రంలోని చేనేత పారిశ్రామిక సహకార సంఘం లిమిటెడ్ కార్యాలయంలో జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటుచేసిన సమావేశంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు అప్పం శ్రీనివాస్ తో కలసి అదనపు కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి రంగంలో వ్యవసాయం తర్వాత చేనేతపైన అధికమంది ఆధారపడి ఉన్నారని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ చేనేత బీమా,లబ్ధిదారులకు యంత్రాల బహుకరణ వంటి పథకాలను ప్రవేశ పెడుతుందన్నారు.ప్రతి ఒక్కరూ వారంలో ఒక్కరోజైనా చేనేత దుస్తువులను వాడాలని అన్నారు.1905 సంవత్సరంలో మహాత్మ గాంధీ విదేశీ వస్తువులను బహిష్కరిస్తూ,స్వదేశీ వస్త్రాలను వాడాలని పిలుపునిచ్చారని,ఆ రోజుని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తారీఖున జాతీయ చేనేత వస్త్ర దినోత్సవం జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు.తెలంగాణ ప్రభుత్వం చేనేత జాతీయ దినోత్సవాన్ని 2017 సంవత్సరం నుంచి జరుపుకుంటున్నామని అన్నారు.
పట్టణంలో గాంధీ విగ్రహం నుంచి ఆ సంఘ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.అనంతరం కార్యాలయంలో జెండా ఎగరవేసి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం అధ్యక్షుడు కడారి బిక్షం,బడుగు అంజయ్య, చేనేత,జౌలి శాఖ డెవలప్మెంట్ ఆఫీసర్ మరియు సూర్యాపేట జిల్లా ఇంచార్జి రంజిత్ కుమార్,కౌన్సిలర్ వెలుగు వెంకన్న,గండూరి రమేష్,చిలువేరు శంకర్, తదితరులు పాల్గొన్నారు.