సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో 167 వ హైవే విస్తరణ పనులు మొదటి నుండి వివాదాస్పదంగానే ఉన్నాయి.సక్రమంగా సజావుగా సాగాల్సిన విస్తరణ పనుల్లో రాజకీయ నాయకుల జోక్యంతో రోజుకో మలుపు తిరుగుతూ మరిన్ని వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతుంది.
నేరేడుచర్ల రాజకీయ నాయకులు ఆడే చదరంగంలో పేదల, మధ్యతరగతి జీవుల బతికు చిత్రం ఛిద్రమవుతున్న నేపథ్యంలో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) బాధితులకు అండగా నిలిచి ఒక్కరోజు నిరవధిక నిరాహార దీక్షకు దిగింది.ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ గతంలో ఓసారి రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డు పక్కన ఉన్న షాపులు, ఇండ్లకు మార్క్ చేసిన ఆర్ అండ్ బి అధికారులు దానిని పక్కన పెట్టి రెండోసారి మరో విధంగా మార్క్ చేసి కూల్చివేతలు ప్రారంభించడంతో నేరేడుచర్లలో ఉద్రికత చోటుచేసుకున్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు.
ఇదే క్రమంలో మరోసారి ఎన్.ఎస్.పి భూమిలోకి ఆర్ అండ్ బి అధికారులు చొరబడి రాజకీయ వత్తిళ్లతో పావులు కదుపుతూ పెద్దలకు న్యాయం చేసే పనిలో నిమగ్నమయ్యారని ఆరోపించారు.నేరేడుచర్ల పట్టణంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇండ్లు,షాపులు కోల్పోయిన బడుగు, బలహీన వర్గాల ప్రజలకోసం బహుజన సమాజ్ పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు.
పేదల పొట్ట కొట్టేందుకు పెద్దలు చేస్తున్న కుట్రలో అధికారులు సైతం భాగస్వాములు కావడం బాధాకరమన్నారు.మిర్యాలగూడ టూ కోదాడ 167వ ప్రధాన రహదారిలో ఉన్న నేరేడుచర్ల పట్టణ విస్తరణ పనుల్లో పెద్ద ఎత్తున నడుస్తున్న రాజకీయ జోక్యం చర్చనీయాంశంగా మారిందని అన్నారు.దీనితో ఆర్ త్రి కెనాల్ ఆయకట్టు రోడ్ నందు గత యాభై ఏండ్ల నుండి నివాసాలు ఏర్పాటు చేసుకొని వివిధ వృత్తుల్లో స్థిరపడి కాయకష్టం చేసుకుంటూ బతుకుతున్న శ్రమ జీవుల బతుకులు ఆగమవుతున్నా పట్టించుకునే నాథుడు లేడని ఆవేదన వ్యక్తం చేశారు.1955 సంవత్సరంలో మిర్యాలగూడ టూ కోదాడ రోడ్ ఏర్పాటు జరిగినప్పుడు 100 పిట్ల రోడ్ తీసినట్లు రికాడ్లు చెప్తున్నాయని,1965,1969 మధ్య గత 100 ఫీట్ల రోడ్డును ఆనుకొని నేరేడుచర్ల కేంద్రంలో ఆర్ 3 కెనాల్ కాలువ మధ్య పాయింటు నుండి కుడి ఎడమలకు అటు ఇటు 33 ఫీట్ల కెనాలు ఏర్పాటు అయిందని,ఒక్కో దగ్గర ఇది 36,44 ఫీట్లుగా కూడా ఉందని,దీనికోసం గతంలో రైతుల నుండి ప్రభుత్వం భూసేకరణ జరిపి పట్టాదారులకు అవార్డు కూడా ఇచ్చిందని గుర్తు చేశారు.ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు హైవే విస్తరణలో భాగంగా నేషనల్ హైవే అథారిటీ వారు పూర్వం తీసిన వారి 100 ఫీట్ల రోడ్డు హద్దుల్లో కాకుండా ఒక పక్క పక్షపాతం చూపిస్తూ ఎన్.ఎస్.పి ఆర్3 కెనాల్ భూమిలోకి ఆర్ అండ్ బి వారు అక్రమంగా దూరి విస్తరణ చేస్తున్నారని ఆరోపించారు.ఆర్3 కెనాల్ భాగంలోనే పేదల ఇండ్లు, షాపులు ఉండడంతో ఉద్దేశ్య పూర్వకంగా కూల్చివేతలు భారీగా చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇంత జరుగుతున్నా అన్నీతెలిసి ఎన్.ఎస్.పి అధికారులు ఎలా ఊరుకుంటున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అసలు ఆర్ అండ్ బి వారు ఎందుకు వారి పాత హద్దులతో కూడిన కొలతలు మార్చి ఎన్.ఎస్.పి కాలువ స్థలాలోకి వస్తున్నారని ప్రశ్నించారు.కేవలం ఎడమ వైపున ఉన్న పెద్దల ఆస్తులను కాపాడేందుకే కుడి వైపున ఉన్న పేదల జీవితాలు ఫణంగా పెడుతున్నారని మండిపడ్డారు.ఇదంతా ఎవరికోసం చేస్తున్నారు? దేనికోసం చేస్తున్నారు?దీనిని నడిపిస్తున్న అసలు సూత్రధారులు ఎవరనేది ప్రజలు గ్రహిస్తున్నారని చెప్పారు.అధికారులు తమ పరిధిలో తాము పనులు చేసుకుంటూ పోతే పాలన సమర్థవంతంగా నడుస్తుందని,రాజకీయ నాయకులకు తొత్తులుగా మారి ప్రజల జీవితాలతో ఆడుకుంటే బహుజన సమాజ్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.ఇప్పటికైనా అధికార యంత్రాంగం జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని ప్రజల పక్షాన నిలబడి వారికి న్యాయం చేయాలని కోరారు.
లేనియెడల భవిష్యత్ లో బీఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు,బాధిత ప్రజలు పాల్గొన్నారు.