సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల( Assembly elections ) సమయం సమీపిస్తుండటంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో టిక్కెట్ల లొల్లి షురూ అయింది.దీనితో జిల్లా రాజకీయం వేడెక్కుతుంది.
ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి అభ్యర్ధి ఎవరనే విషయంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చినట్లు కనిపిస్తుంది.ఈ ఏడాది చివరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధి ఎవరనే విషయంలో అధికార బీఆర్ఎస్ తో పాటు బీజేపీ,వైఎస్ఆర్ టిపి వంటి పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్ధులను ప్రకటించి,అభ్యర్థుల సస్పెన్షన్ కి తెరదించాయి.
బీఆర్ఎస్ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎమ్మెల్యే గాదరి కిషోర్( MLA Gadari Kishore ) మూడోసారి బరిలో ఉంటారని మంత్రి కేటీఆర్ ప్రకటించగా,వైఎస్ఆర్ టిపి రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రలోనే ఏపూరి సోమన్నను ప్రకటించారు.బీజేపీ అభ్యర్థిగా గతంలో పోటీ చేసిన కడియం రామచంద్రయ్యకే అవకాశాలు మెండుగా ఉన్నాయని,దాదాపు ఆయన అభ్యర్థిత్వం ఖరారైనట్లేనని తెలుస్తోంది.
బీఎస్పీ నుండి ఒక పెద్ద తలకాయ బరిలో ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.కాంగ్రెస్ మినహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు దాదాపు తమతమ అభ్యర్థులను ఖరారు చేసినా,హస్తం పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైనట్లు కనిపిస్తోంది.2018 ముందస్తు ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ఆలస్యం కావడంతోనే చాలా మంది ఓటమి పాలయ్యారని కాంగ్రెస్ పెద్దలే ఆ తర్వాత కుండలు బద్దలు కొట్టుకున్నారు.అయినా ఈ సారి కూడా అదే సీన్ రిపీట్ అయ్యేలా ఉందని నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలో ఉన్నారు.
మిగతా పార్టీలు అభ్యర్ధులను ప్రకటించి, ఓట్ల రాజకీయంలో తలమునకలైతే…హస్తం పార్టీ మాత్రం సీట్ల రాజకీయంలోనే సిగపట్లు పడుతుందని ఆవేదన చెందుతున్నారు.అభ్యర్ధి ఎవరనే విషయంలో క్లారిటీ వచ్చిన పార్టీల్లో అసంతృప్తి ఉన్నా ఇప్పటికే అంతా సర్దుకొని లీడర్,క్యాడర్ లో సంతోషం కనిపిస్తుంటే, కాంగ్రెస్ చేసిన తప్పే మళ్ళీ చేసేలా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అందరూ ముందుగానే ప్రచారానికి ఓ అడుగు ముందుకేసే అవకాశాలు కనిపిస్తుంటే హస్తం శ్రేణుల్లో మాత్రం అంతర్మథనం మొదలైంది.బలమైన నేత లేకనా బలవంతుల పంతం నెగ్గకనా…? తుంగతుర్తిలో అన్నీ ఉన్నా కాంగ్రెస్ నేతల్లో శని ఉన్నట్లుగా అనిపిస్తుంది.బలమైన క్యాడర్,లీడర్ ఉన్నా నడిపించే నాయకుడే కనిపించక కాంగ్రెస్ కంగారు పడుతుంది.ఎస్సీ రిజర్వుడ్ కావడం చేత, పెద్ద పెద్ద నాయకుల పెత్తనం ఎక్కువైందనే విమర్శలు ఉన్నాయి.
మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి( Minister Ramireddy Damodar Reddy ) మొదటి నుండి తుంగతుర్తికి ఖర్మ, కర్త,క్రియగా హస్తం పార్టీని నడిపిస్తున్న విషయం తెలిసిందే.గత రెండు పర్యాయాలు కాంగ్రెస్ అభ్యర్థిగా అద్దంకి దయాకర్ రావడంతో ఇక్కడ రెండు వర్గాలుగా చీలిపోయారు.
ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గాలు తయారై నాలుగు వర్గాలుగా చీలిపోయి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నట్లుగా సమాచారం.మరోవైపు స్థానిక, స్థానికేతర సమస్య తెరమీదికి వస్తుండడంతో మూడోసారి అద్దంకి అడ్డంకిగా మారిందనే వాదన వినిపిస్తోంది.
అంతేకాకుండా కార్యకర్తలకు అందుబాటులో ఉండడనే అపవాదు కూడా ఉంది.దీనితో నియోజక పార్టీ ఇంఛార్జి నరసయ్య,డాక్టర్ వడ్డేపల్లి రవి,అడ్వకేట్ జ్ఞాన్ సుందర్,నగరి ప్రీతం టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే ఆశావాహుల లిస్ట్ భారీగా ఉంటే ఇందులో మరో మహిళ పేరు కూడా వినిపిస్తోంది.జర్నలిస్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్ భార్య కృష్ణవేణి కూడా ఇక్కడి నుండి బరిలో ఉండాలని సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అది కొందరు కాంగ్రెస్ నేతలే గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టేందుకు ఈమెను తెరపైకి తెస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.ఊరందరిదీ ఒక దారైతే ఉలిపి కట్టెది మరోదారి అన్నట్లుగా తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉందని పార్టీ శ్రేణులు వాపోతున్నారు.