సూర్యాపేట జిల్లా: వర్షాకాలం వస్తుందంటే చాలు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కేశవపురం-వెలుగుపల్లి గ్రామాల ప్రజల వెన్నులో వణుకు మొదలవుతుంది.దానికి కారణం ఆ గ్రామాల మధ్య నుండి పారే బంధం వాగు.
వర్షాకాలంలో ఈ వాగు నుండి వచ్చే వరద తాకిడికి రెండు గ్రామాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి,విద్యా,వైద్యం,వ్యవసాయ,ఇతర నిత్యావసరాలకు కూడా ప్రజలు అవస్థలు పడాల్సి వస్తోంది.పశువులు కూడా మేతకు వెళ్లలేని అధ్వాన్న పరిస్థితులు నెలకొని ప్రజల జీవన విధానం పూర్తిగా స్తంభించి పోతుంది.
తరాలు మారినా బంధం వాగు తలరాత మాత్రం మారలేదని,పాలకులు మారినా ప్రజల బతుకు చిత్రం మారలేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
ఈ సమస్యపై రెండు గ్రామాల యువకులు,ప్రజలు గత కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా బంధం వాగుపై బ్రిడ్జి నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వానికి, స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని వాపోతున్నారు.
ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి, కేశపురం- వెలుగుపల్లి గ్రామాల మధ్య ప్రవహిస్తున్న బంధం వాగుపై బ్రిడ్జి నిర్మించి, రెండు గ్రామాల ప్రజల చిరకాల కోరికను నెరవేర్చాలని కోరుతున్నారు.