ఆత్మకూర్ (ఎస్) మండలం( Atmakur ) పాతర్ల పహాడ్ లోని చెంబుని చెరువు కట్ట తెగి వరద నీరు గ్రామంలోకి రావడంతో ప్రజలు ఇబ్బందులకు గురైనారని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు గురువారం సాయంత్రం సందర్శించి,జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించారు.
గ్రామంలో ఇప్పటివరకు మూడిళ్లు కూలిపోయినవని,వరద నీరు క్రమంగా తగ్గుముఖం పట్టిందని తాహాసిల్దార్ పుష్ప( Tahsildar Pushpa ) కలెక్టర్ కు వివరించారు.అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించడం వలన ఎలాంటి నష్టం వాటిల్ల లేదని,కొన్ని ఇళ్లలో వరద నీటి వలన పాక్షికంగా దెబ్బతిన్న వాటిని గుర్తించి నివేదిక సమర్పించాలని తాహాసిల్దార్ కు కలెక్టర్ తెలియజేశారు.
చెంబుని చెరువు నుండి వచ్చు ఫీడర్ ఛానల్ పరిశీలించిన పిదప కలెక్టర్ ఫీడర్ ఛానల్ పై బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.గ్రామ నివాసి అయిన పలస రాములమ్మ వరద నీటి వల్ల తన ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నదని చూడవలసిందిగా కోరిన వెంటనే కలెక్టర్ రాములమ్మ ఇంటిని, అలాగే దాసరి సాయన్న ఇంటిని కూడా పరిశీలించారు.
దాసరి సామ్యూల్ రాత్రి కురిసిన వర్షాల వల్ల గ్రామంలోకి వచ్చిన వరద వల్ల అనారోగ్యానికి గురయ్యానని కలెక్టర్ కు తెలుపగా కలెక్టర్ వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేయాలని డిఎంహెచ్వోకు తెలిపారు.మండల అధికారులు గ్రామంలోని వరద ముప్పుకు గురైన ఇళ్లను గుర్తించి నివేదిక తయారు చేసి పంపాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తాహాసిల్దార్ పుష్ప,గ్రామ సర్పంచ్ మల్లయ్య, ఇరిగేషన్ డిఈ నగేష్,జేఈ రామారావు,డిఎం శర్మ పాల్గొన్నారు.