యాదాద్రి భువనగిరి జిల్లా: బీఆర్ఎస్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పురోగతి చెందిదని గప్పాలు కొడుతున్న కేసీఆర్ సర్కార్, కేవలం బడా బాబుల భూములకు రెక్కలొచ్చేలా చేసి, సామాన్య రియల్టర్ల నోట్లో మట్టి కొట్టిందని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎలాంటి కట్ ఆఫ్ డేట్ ప్రకటించకుండా అక్రమ లే అవుట్ ప్లాట్స్ క్రయవిక్రయాలు నిలిపివేయాలని మూడేళ్ల క్రితం కేసీఆర్ సర్కార్ ఆదేశాలు జారీ చేసి, వెంచర్ లోని ప్లాట్స్ నిలిపివేయడంతో పెట్టుబడులు పెట్టిన రియల్టర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని లబోదిబోమంటున్నారు.20 ఏళ్ల క్రితం చేసిన వెంచర్లలో మిగిలిన ప్లాట్స్ కూడా అమ్మకుండా నిలిపివేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
అప్పులు తెచ్చి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడితే ప్లాట్స్ క్రయవిక్రయాలు నిలిపివేయడంతో అప్పుల్లో కూరుకుపోయమని,పుస్తెలమ్మి వడ్డీలు చెలిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అక్రమ లే అవుట్ ప్లాట్స్ క్రమబద్దీకరించుకునేందుకు 2020 లో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ప్రక్రియ చేప్పటిందని,ప్లాట్ కు రూ.1000/-,వెంచర్ కు రూ.10 వేల చొప్పున దరఖాస్తు రుసుమును స్వీకరించిందని,కానీ, ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేయలేదన్నారు.ఎన్నికల సమయంలోనైనా ప్లాట్స్ కు మోక్షం లభిస్తుందని ఆశించిన రియల్టర్లకు కేసీఆర్ సర్కార్ మొండిచేయి చూపిందన్నారు.
అక్రమ వెంచర్ ప్లాట్ల క్రయవిక్రయాలపై ఎటువంటి స్పష్టత ఇవ్వని బీఆర్ఎస్ సర్కార్ కు త్వరలో జరిగే ఎన్నికల్లో బుద్ది చెబుతామని పలువురు రియల్టర్లు హెచ్చరిస్తున్నారు.అక్రమ లే అవుట్ ప్లాట్లకు పరిష్కారం చూపించాలని చౌటుప్పల్ కు చెందిన రియల్టర్ కుక్కల నర్సింహా అన్నారు.
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల ద్వారా రియల్టర్లు తీవ్రంగా నష్టపోయాం.పెట్టుబడులు పెట్టి ప్లాట్లు అమ్ముకోలేక పోతున్నాము.ఎన్నికల సమయంలోనైనా పరిష్కారం లభిస్తుందనుకుంటే మాకు నిరాశే మిగిలింది.ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అక్రమ లే అవుట్ ప్లాట్లకు పరిష్కారం చూపించాలని కోరారు.







