నల్లగొండ జిల్లా:విద్యుత్ సరఫరా( Power supply )లో హోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఏర్పాటు చేసే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు ప్రమాదకరకంగా మారాయని నల్లగొండ జిల్లాలోని మర్రిగూడ మండలం మేటిచందాపురం, గుర్రంపోడ్ మండలం బ్రహ్మన్నగూడెం గ్రామాల ప్రజలు పరేషాన్ అవుతున్నారు.
ప్రధాన రహదారుల పక్కనజనావాసాల మధ్యలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు(Electrical transformers ) అతి తక్కువ ఎత్తుగా ఉండడంతో పాటు రక్షణ కూడా లేకపోవడంతో, దాని పక్క నుంచి వెళ్లే ప్రజలకు,మూగజీవాలకు తాకే విధంగా ఉందని, పిల్లలు,మేకలు,గొర్రెలు,పశువులు ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని,అంతేకాకుండా రాత్రివేళల్లో వర్షానికి ట్రాన్స్ఫార్మర్ దగ్గర కరెంట్ మెరుపులు వస్తున్నాయని,ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ప్రధాన రహదారి కావడంతో నిత్యం వేలాదిమంది ప్రయాణిస్తుంటారని,వాహనాలు( Vehicles ) అదుపుతప్పితే ట్రాన్స్ఫార్మర్ను ఢీకొనే అవకాశం ఉందని వాపోతున్నారు.పలుమార్లు విద్యుత్ అధికారులకు చెప్పినా పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసలే వర్షాకాలం కావడంతో ఉరుములు,మెరుపులు సంభవించినప్పుడు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వలన ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఎలాంటి ప్రాణనష్టం జరగకముందే ట్రాన్స్ఫార్మర్ల ఎత్తు పెంచి,రక్షణ కంచ ఏర్పాటు చేయాలని రెండు గ్రామాల ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.
ఈ విషయంపై విద్యుత్ శాఖ అధికారులను వివరణ కోరగా సమస్య మా దృష్టికి రాలేదని,ఆ సమస్యకు వెంటనే మరమ్మతులు చేపట్టి, చుట్టూ కంచె ఏర్పాటు చేసి,సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.