నల్గొండ జిల్లా:నాగార్జున సాగర్ నియోజకవర్గం గుర్రంపోడ్ మండలంలో “గులాబీ కండువా కప్పుకో ప్రభుత్వ పథకం అందుకో” అంటూ అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రభుత్వ పథకాల పేరుతో ప్రజలను,ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను ప్రలోభాలకు గురి చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.ఇటీవల నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గృహలక్ష్మి,బీసీబంధు లబ్దిదారులను ఎంపిక చేసే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ( BRS party )కండువా కప్పుకుంటేనే మీ పేరు లబ్దిదారుల జాబితాలో ఉంటుందని బహిరంగంగానే చెబుతున్నట్లు సమాచారం.
గుర్రంపోడ్ మండలం కొప్పోల్ లో గత ఏప్రిల్ లో వడగండ్ల వానకి ఓ కాంగ్రెస్ కార్యకర్త ఇల్లు పూర్తిగా కూలిపోయింది.దీంతో కొద్దిమంది బీఆర్ఎస్ కార్యకర్తలు అతనికి గృహలక్ష్మి పథకంలో ఇల్లు పెట్టిస్తామని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లి గులాబీ కండువా కప్పించారు.
తీరా చూస్తే అతనికి గృహలక్ష్మి పథకంలో( Grilahakshmi Scheme ) ఇల్లు రాకపోవడంతో అతనికి కండువా కప్పించిన గులాబీ కార్యకర్తతో వాగ్వివాదానికి దిగినట్లు తెలుస్తోంది.ఇక్కడే కాదు నియోజకవర్గ వ్యాప్తంగా ఏ పథకం పొందాలన్నా సామాన్య ప్రజలు కండువా కప్పుకోవాలని అధికార పార్టీ కార్యకర్తలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తుండగా ఈ వ్యవహారమంతా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
గత ప్రభుత్వాలు అర్హులను చూసి ప్రభుత్వ పథకాలు అమలు చేశాయి,కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వంలో పథకం పొందాలంటే కండువాలు కప్పుకోవాలనే కొత్త సంస్కృతికి తెరలేపారని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.ఇదేం పార్టీ…? ఇదెక్కడి ప్రభుత్వం…? అని గుర్రంపోడ్ కు చెందిన కుప్ప యల్లేష్ అంటున్నారు.గతంలో ఎన్నడూ లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని,మా ఊర్ల బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ఇల్లు ఇస్తాం,బీసీబంధు ఇస్తాం,దళితబంధు ఇస్తామని చెప్పి గులాబీ కండువాలు కప్పుకోవాలని సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెడుతుండ్రని,మాకు ఏ పార్టీ లేదు,మేం గృహలక్ష్మి పథకానికి అర్హులం,మాకు ఇండ్లు ఇవ్వాలని జనాలు కరాఖండిగా చెబుతుండ్రని,అయినా బీఆర్ఎస్ వాళ్లు కండువా కప్పుకోవాలని ఇబ్బందులు పెడుతుండ్రని,ఇదేం పార్టీ ఇదెక్కడి ప్రభుత్వమో అర్దం కావడం లేదంటున్నారు
.