నల్లగొండ జిల్లా: అనుముల మండలం హాలియా పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా వైద్యం వికటించి మృతి చెందిన 45 రోజుల పసి ప్రాణానికి లక్షా యాభై వేలు ఖరీదు కట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే… నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండలం జాల్ తండాకు చెందిన జటావత్ రవికుమార్,అఖిల దంపతుల 45 రోజుల మగ శిశువు ఆదివారం అస్వస్థకు గురయ్యాడు.
వెంటనే హాలియా పట్టణంలోని పిల్లల ఆస్పత్రికి తీసుకువచ్చారు.శిశువును పరీక్షించిన వైద్యుడు శిశువులో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి మందులు, ఇంజక్షన్ ఇచ్చి పంపించాడు.
సోమవారం మధ్యాహ్నం వరకు మళ్ళీ తీవ్ర అస్వస్థతకు గురవడంతో తిరిగి శిశువు తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువచ్చారు.కాగా పరిశీలించిన వైద్యుడు అప్పటికే శిశువు మృతి చెందాడని బంధువులకు తెలిపారు.
దీంతో శిశువు మృతికి వైద్యుడే కారణమని ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.ఈ విషయమై వైద్యుని వివరణ కోరెందుకు ప్రయత్నించగా మాట్లాడేందుకు నిరాకరించారు.ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పెద్ద మనుషులు హాస్పిటల్ యాజమాన్యంతో మంతనాలు జరిపి బాధిత కుటుంబ సభ్యులకు లక్షా యాభై వేలు ఇప్పించినట్లు సమాచారం.అయితే ఏదో ఒక కారణంతో హాస్పిటల్ లో మరణాలు సంభవించడం కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడం,వెంటనే కొందరు పెద్ద మనుషులుగా చెలామణి అవుతూ రంగంలోకి దిగడం సెటిల్మెంట్ చేయడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ క్రమంలో అసలు వాస్తవాలు వెలుగులోకి రాకుండా మొత్తం మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.