జన్మదినం వేళ భారీ బల నిరూపణకు వీరేశం రంగం సిద్దం

నల్లగొండ జిల్లా:నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్‌ పార్టీ రాజకీయాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంకు(VEMULA VEERESHAM ) సాగుతున్న ఆధిపత్య పోరులో మరో కీలక పరిణామానికి వేముల జన్మదిన వేడుకలు వేదికగా మారనున్నాయా అంటే అవుననే పరిస్థితులే కనిపిస్తున్నాయి.జూన్ 1న తన జన్మదిన వేడుకల సందర్భంగా వేముల వీరేశం నియోజకవర్గంలో తనకున్న ప్రజాబలం చాటాలని నిర్ణయించుకొని, నకిరేకల్ పట్టణంలో నిర్వహించ తలపెట్టిన జన్మదిన వేడుకలకు భారీ స్థాయిలో ప్రజలను ఆహ్వానిస్తూ ఏకంగా 30 వేల మందికి భోజనం వసతికి ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది.

 Vemula Veeresham Is Ready For A Huge Show Of Strength On The Birth Day , Vemu-TeluguStop.com

గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన లింగయ్యతో సాగిన ముఖాముఖి పోరులో ఓటమిపాలైన వీరేశం రానున్న ఎన్నికల్లో గెలిచి తీరాలన్న లక్ష్యంతో ప్రజాధరణ దిశగా కొన్నాళ్లుగా తీవ్రంగానే శ్రమిస్తున్నారు.

నిత్యం ప్రజల్లో ఉంటూ వారు పిలిచిందే తడవుగా అన్ని కార్యక్రమాలకు హాజరవుతూ మళ్లీ జనంలో బలం పుంజుకోవడంలో ముందడుగు వేశారు.

ఉద్దీపన పేరుతో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం తన నిరంతర ప్రయత్నాలను వేముల కొనసాగిస్తున్నారు.కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్‌లో చేరి తనకు ప్రత్యర్థిగా మారిన లింగయ్యను ఎదుర్కోవడమే లక్ష్యంగా నిరంతరం వీరేశం ఎత్తులు వేస్తూనే ఉన్నారు.

మళ్లీ ప్రజాధరణ పెంచుకుంటూ వేముల ఫామ్ లోకి రాగా, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్‌ టికెట్ తనకే వస్తుందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు.వేములకు బీఆర్ఎస్‌ టికెట్ రాని పక్షంలో ఆయనను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రధాన ప్రతిపక్షాలు రెడీగా ఉన్నాయి.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తన రాజకీయ బల ప్రదర్శన అన్నట్లుగా,టికెట్ సాధనలో బీఆర్ఎస్‌ అధిష్టానం దృష్టిని ఆకర్షించేలా జన్మదిన వేడుకలకు వేముల పూనుకోవడం నియోజకవర్గం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.మరోవైపు వేములకు ధీటుగా సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సైతం ఎప్పటికప్పుడు తన కార్యకలాపాలు ముమ్మరం చేస్తూ వేములతో ప్రతి అంశంలోనూ ఢీ అంటే ఢీ అంటున్నారు.

దీంతో నియోజకవర్గంలో ప్రతి గ్రామస్థాయిలోనూ బీఆర్ఎస్‌ పార్టీ ( BRS party )వేముల, చిరుమర్తి వర్గాలుగా చీలిపోయింది.ఆమధ్య హోలీ పండుగ వేడుకల్లో ఇరు వర్గాలు రోడ్లపైనే బల ప్రదర్శనకు దిగడం ఉద్రిక్తతలు రేకెత్తించింది.

నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని మాజీ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్,కంచర్ల కృష్ణారెడ్డిలు వేములకు మద్దతుగా సాగుతున్నారు.గత ఎన్నికల్లో వేములపై చిరుమర్తి కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించినప్పటికీ ఆ గెలుపులో అప్పట్లో వేముల పట్ల నెలకొన్న వ్యతిరేకత,కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రభావం ఉండగా, ప్రస్తుతం వారితో కూడా ఆయనకు పొసగని పరిస్థితి ఉంది.

ఇటీవల నియోజకవర్గంలోని మండలాలకు సాగు తాగునీటిని అందించే ఉదయ సముద్రం బ్రాహ్మణవెల్లంల ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రభుత్వ సహకారంతో ట్రయల్ రన్ వరకు పనులు జరిగేలా చూడటంలో లింగయ్య సఫలీకృతమైనప్పటికీ,ఆ ప్రాజెక్టు నిర్మాణ ఘనత తనదే అన్న ప్రచారాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి జనంలోకి తీసుకెళ్లారు.

అదీగాక లింగయ్య కాంగ్రెస్ ( Congress , నుండి బీఆర్ఎస్‌లో చేరిన క్రమంలో తన వెంట పెద్దగా కాంగ్రెస్ కేడర్ ను తీసుకెళ్లలేక పోయారు.

దీంతో ప్రస్తుతం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సైతం కొండేటి మల్లయ్య,దైద రవీందర్, వేదాసు వెంకయ్యల ఆధ్వర్యంలో బలంగా తమ కార్యకలాపాలు సాగిస్తుంది.సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు,నిధుల మంజూరుతో బలం పెంచుకునేందుకు లింగయ్య సైతం నిత్యం ప్రజల మధ్యన పర్యటనలు సాగిస్తున్నారు.

ఆయితే సొంత పార్టీలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం రూపంలో బలమైన ప్రత్యర్థితో తలపడాల్సి వస్తుండడమే లింగయ్యకు సవాలుగా తయారైందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube