నల్లగొండ జిల్లా:కేంద్రంలో నరేంద్ర మోడీ( Narendra Modi ) నాయకత్వంలో నడుస్తున్న బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లుగా అన్నిరంగాల ప్రజలను మోసం చేస్తూ, కార్పొరేట్ శక్తులను బలోపేతం చేస్తూ సాగిస్తున్న ప్రజావ్యతిరేక పాలనను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా వామపక్ష,లౌకిక పార్టీలు శుక్రవారం ఇచ్చిన గ్రామీణ భారత్ బంద్( Gramin bharat bandh ) ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విజయవంతమైంది.ఉదయం నుండే వామపక్ష పార్టీల,ట్రేడ్ యూనియన్ల, రైతు,వ్యవసాయ కార్మిక సంఘాల కార్యకర్తలు రోడ్ల మీదకు వచ్చి వ్యాపార, వాణిజ్య సంస్థలను బంద్ చేశారు.
కొన్నిచోట్ల ర్యాలీలు,ప్రధాన రహదారిపై రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దగ్దం చేస్తూ కార్యక్రమాలు నిర్వహించారు.
దీనితో పలు చోట్ల ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భారత్ బంద్ ముగిసింది.ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ దేశంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర అందించకుండా,కార్మికులన్యాయమైన డిమాండ్లనునెరవేర్చకుండా,సామాన్య ప్రజలను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ, కార్పొరేట్ శక్తులకు పబ్లిక్ రంగ సంస్థలను అప్పనంగా కట్టబెడుతూ దేశ సంపదను దోచిపెడుతున్న మోడీ అండ్ కో హక్కుల కోసం అడిగితే అరెస్టులు చేస్తూ, ప్రశ్నిస్తే పాశవికంగా దాడులు చేస్తూ, ఉద్యమకారులపైన కాలం చెల్లిన కఠినమైన చట్టాలను అమలు చేస్తూ నిర్బంధంలో వేస్తూ నియంతృత్వ పోకడలతో పాలిస్తున్న మోడీ సర్కార్ ను గద్దె దించే వరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
రైతుల( Farmers ) హక్కులను కాలరాస్తున నరేంద్రమోదీ ప్రభుత్వం,రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిస్తే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ప్రశ్నార్ధకంగా మారే అవకాశం ఉందని,ఇలాంటి ఫాసిస్టు విధానాలతో దేశాన్ని నాశనం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోమని,రాబోయే కాలంలో ప్రజాతంత్ర,లౌకిక శక్తులను కలుపుకొని బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పారు.