నల్లగొండ జిల్లా: అడవిబిడ్డల వెన్నులో వణుకు పుట్టించిన యురేనియం ఇష్యూ కొన్నాళ్ళ పాటు సైలెంట్ గా ఉండడంతో యురేనియం తవ్వకాలు జరుగుతాయా? దీనికోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారా? అని ఇంతకాలం సందిగ్గంలో ఉన్న నేపథ్యంలో తాజాగా పెద్దగట్టు, నంబాపురం గ్రామ పరిసరాల్లో ఉదయం 11 గంటల సమయంలో హెలికాప్టర్ చక్కర్లు కొట్టడంతో యురేనియం కోసమే ఆకాశమార్గాన సర్వే నిర్వహించినట్లు నల్లగొండ జిల్లా నల్లమల రిజర్వ్ ఫారెస్టు పరిధిలోని దేవరకొండ,చందంపేట, పిఏపల్లి మండలాల ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసిఐఎల్), బార్క్ సిబ్బంది యురేనియం నిక్షేపాల అన్వేషణకు తాజాగా సర్వే,శాంపిళ్ల సేకరణకు ప్రయత్నించగా కంబాలపల్లి,చిత్రియాల గ్రామస్థులు అభ్యంతరం చెప్పడంతో వారు వెనుతిరిగారు.2002 నుండి దేవరకొండ డివిజన్ నల్లమల్ల అటవీ ప్రాంత పరిధిలో యురేనియం నిక్షేపాల తవ్వకాల కోసం యూసిఐఎల్ సాగిస్తున్న ప్రయత్నాలను స్థానికులు అడ్డుకుంటున్నప్పటికీ మరోసారి అందుకు ప్రయత్నించడం గమనార్హం.జిల్లా అటవీ శాఖ నుండి సర్వే పేరుతో అనుమతులు తీసుకున్నప్పటికీ గతంలో డ్రిల్లింగ్ చేసిన అనుభవాల నేపథ్యంలో స్థానికులు సర్వే యత్నాలను సైతం వ్యతిరేకించారు.
యూసిఐఎల్ సిబ్బంది గతంలో వేసిన బోర్ల నుండి శాంపిళ్లను తీసుకెళ్లారు.ఇటీవల సాగర్ రైట్ బ్యాంక్ పరిధిలోని అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల సర్వేలను వ్యతిరేకిస్తూ గిరిజనులు సంఘాలుగా ఏర్పడి ఆందోళన చేపట్టారు.
నల్లమల రిజర్వ్ ఫారెస్టు పరిధిలో దేవరకొండ డివిజన్ యురేనియం నిక్షేపాల గ్రామాలుండడంతో నిబంధనల మేరకు అటవీ శాఖ యురేనియం తవ్వకాలకు అనుమతులు నిరాకరిస్తూనే వచ్చింది.యురేనియం నిల్వల వెలికితీత,శుద్ధి ప్రక్రియల సందర్భంగా వెలువడే రేడియో అణుధార్మిక వ్యర్థాలు భూగర్భ జలాలతో పాటు సమీపంలోని నాగార్జున సాగర్ జలాలను కలుషితం చేస్తాయన్న ఆందోళనతో యురేనియం సేకరణ యత్నాలపై వ్యతిరేకత నెలకొంది.
తవ్వకాలు మనుషులకు, వన్యప్రాణులకు,జీవ వైవిధ్యానికి ముప్పు చేస్తుందన్న భయం స్థానికుల్లో నెలకొంది.అయితే ఈ ప్రాంత భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ పాటు యురేనియం మోతాదు మించి ఉందని, యురేనియం సేకరణతో ఆ సమస్య తీరుతుందని, తవ్వకాలపై ఆందోళనలు వద్దంటూ ఇప్పటికే బార్క్ ప్రకటించింది.
ఐనప్పటికీ ఈ ప్రాంత వాసులు యురేనియం తవ్వకాలపై నెలకొనే పర్యావరణ సమస్యల భయంతో తమ వ్యతిరేకతను కొనసాగిస్తున్నారు.దేవరకొండ డివిజన్ పరిధిలోని నల్లమల ఫారెస్టు పరిధిలోని గ్రామాల్లో 18 వేల టన్నుల యురేనియం నిక్షేపాలు ఉన్నాయని,దేశంలోని ఇతర ప్రాంతాల యురేనియం కంటే ఈ ప్రాంత యురేనియం 0.6 శాతం నాణ్యతతో ఉందని 2015 మే నెలలో బార్క్ (బాబా అణు పరిశోధన కేంద్రం) సంచాలకులు శేఖర్ బసు వెల్లడించారు.రెండు తెలుగు రాష్ట్రాలతో చర్చించి దేశ అణువిద్యుత్ అవసరాల నేపథ్యంలో యురేనియం తవ్వకాలకు ప్రయత్నిస్తామన్నారు.
అయితేస్థానికులు మాత్రం యురేనియం నిల్వల వెలికితీత యత్నాలను ఆది నుండి అడ్డుకుంటూనే ఉన్నారు.శుద్ధికర్మాగారానికి సన్నాహాలు గతంలో దేవరకొండ మండలం శేరిపల్లి,ముదిగొండ పరిధిలో 300 ఎకరాల్లో, చందంపేట మండలం చిత్రియాల,పెద్దమూల గ్రామాల గుట్టల ప్రాంతాల్లోని 2,400 ఎకరాల్లో,పిఏపల్లి మండలం నంబాపురం, పెద్దగట్టు గ్రామాల పరిధిలో 1105 ఎకరాల అటవీ భూములతో పాటు 197 ఎకరాల పట్టా భూముల్లో 11.2 మిలియన్ టన్నుల యురేనియం ఉన్నట్లు 2002 వరకు జరిగిన యూసిఐఎల్ సర్వే గుర్తించి శాంపిళ్ల సేకరణ పనులు చేపట్టింది.శేరిపల్లిలో యురేనియం శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని 2002 నుండి ప్రయత్నాలు సాగుతున్నాయి.అయితే 2002లో నంబాపురం, 2004లో శేరిపల్లిలో యురేనియం నిల్వల శుద్ధి కేంద్రాల ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ జరుపగా స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు.2003లో మావోయిస్టులు పెద్దగట్టు వద్ద డ్రిల్లింగ్ మిషన్‌ను దగ్ధం చేశారు.మళ్లీ 2005 నుండి యురేనియం నమూనాల సేకరణ పనులు కొనసాగించగా ప్రజల నుండి నిరసనలు ఎదురవడంతో అప్పట్లో వైఎస్సార్ ప్రభుత్వం శేరిపల్లి యురేనియం ప్రాజెక్టును కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం పరిధిలోకి మార్చారు.అనంతరం యురేనియం నిల్వల నమూనాల సేకరణ ప్రయత్నాలను యూసిఐఎల్ కొనసాగించింది.
పెద్దమూల గుట్టలపై యురేనియం నమూనాల సేకరణ కోసం తీసిన గుంతల్లో నీటిని తాగి మూగజీవాలు మృతి చెందడం అప్పట్లో యురేనియం తవ్వకాల ఆందోళనను ఉధృతం చేసింది.కొంతకాలం స్తబ్ధత పిదప మళ్లీ 2012 జూలై నుండి అక్టోబర్ వరకు యూసిఐఎల్ యురేనియం తవ్వకాల పనులు సాగించింది.
మళ్లీ ప్రజావ్యతిరేకత ఎదురవడంతో సేకరణ పనులు నిలిపివేశారు.ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి యూసిఐఎల్ దేవరకొం డివిజన్‌లో యురేనియం సేకరణ ప్రయత్నాలు చేయడం దేవరకొండ,పిఏపల్లి,చందంపేట ప్రాంతవాసుల్లో ఆందోళన రేపినట్లయింది.
చందంపేట మండలం చిత్రియాలలో యురేనియం శాంపిళ్ల సేకరణ కోసం తవ్వకాలు జరుగుతుండడం గమనార్హం
.