సూర్యాపేట జిల్లా:అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గౌతమి డిగ్రీ కళాశాలలో శనివారం ఉపా చట్టాన్ని రద్దు చేయాలని అరుణోదయ జిల్లా ప్రధాన కార్యదర్శి కంచనపల్లి సైదులు( Kanchanapally Saidulu ) అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొని తమతమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉదయగిరి ముఖ్యాతిధిగా హాజరై మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ప్రజా ఉద్యమకారులను నిరంకుశత్వంగా అణిచివేయడానికి ఎన్ఐఎతో ఉపా చట్టాన్ని ఉపయోగించుకొని జైలుపాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టాలను అతిక్రమిస్తూ, టాడా,పోటా లాంటి చట్టాలను 2019లో సవరణ చేస్తూ ఉపచట్టాన్ని క్రూరత్వంగా మార్చారని,ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటిదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కూడా 152 మంది పైగా ఎలాంటి ఆధారాలు లేకుండా, చివరికి చనిపోయిన వారిపై కూడా దేశద్రోహ కేసులు నమోదు చేశారని, ఈ వ్యవస్థ మారాలని పాకవర్గాలపై పోరాటం చేస్తున్న ముఖ్యంగా విప్లవకారులపై,మార్పు కొరకు పోరాడే వారిపై నిర్బంధాలను ప్రయోగించడం బీజేపీ ప్రభుత్వానికి పరిపాటి అయిందన్నారు.సాయిబాబా,వరవరరావు చివరికి హరగోపాల్ సార్ పై కూడా ఉపా చట్టాన్ని ప్రయోగించడం అన్యాయం అన్నారు.
పార్లమెంటరీ ప్రజాస్వామిక విలువలకు మోడీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని విమర్శించారు.ఉపా చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని లేనిపక్షంలో అన్ని సంఘాలతో బలమైన పోరాటాలు నిర్మిస్తామని హెచ్చరించారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం.డేవిడ్ కుమార్ మాట్లాడుతూ మోడీ,కేసీఆర్ లు ప్రజల సమస్యలను గాలికొదిలేసి ప్రజల కోసం పనిచేసే ప్రజా సంఘాల నేతలపై నిర్బంధాన్ని ప్రయోగించడం అవివేకమన్నారు.వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు,సిపిఐ (ఎంఎల్ )రాష్ట్ర నాయకులు బుద్ధ సత్యనారాయణ,బిసిపి జిల్లా కార్యదర్శి చామకూరి నరసయ్య,పి.డి.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అవుల నాగరాజు,ఎల్ హెచ్ పిఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్,కోటయ్య,సీపీఐ (ఎంఎల్) నాయకులు బాలస్వామి,ప్రజా నాట్య మండలి నాయకులు రాంబాబు,డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహారావు, నారబోయిన వెంకట్ యాదవ్,బీఎస్పీ నాయకులు దాసరి రాములు,రామకృష్ణ రెడ్డి,గంట నాగయ్య, కునుకుంట్ల సైదులు,బొడ్డు శంకర్,పిడమర్తి భరత్, సామా నర్సిరెడ్డి,నగేష్, బోళ్ళ వెంకన్న,తడకమల్ల సంజీవ్,బోల్క పవన్ తదితరులు పాల్గొన్నారు.