సూర్యాపేట జిల్లా:భర్త కాపురానికి తీసుకుపోవడం లేదని,అత్తవారింటికి రానివ్వడం లేదంటూ ఓ కోడలు అత్తారింటి ముందు ధర్నాకు దిగిన ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే సూర్యాపేట చర్చి కాంపౌండ్ కు చెందిన సుష్మకు అమరవాది నగర్ కు చెందిన గుండబత్తిన బలరామక్రష్ణతో 2020 నవంబర్ 18 న వివాహం జరిగింది.
వారి వైవాహిక జీవితానికి సాక్ష్యంగా ఓ పాప జన్మించింది.కొంతకాలం వరకు సాఫీగా సాగిన వారి కాపురంలో అత్త,ఆడబిడ్డ, తోటికోడలు రూపంలో వేధింపులు మొదలై,కలతలు చోటుచేసుకున్నాయి.
దీనితో భార్యాభర్తల మధ్య దూరం పెరిగింది.తనను అత్తారింటికి రాకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ బుధవారం గుండబత్తిన సుష్మ తన ఏడు నెలల పాపతో పాలిటెక్నిక్ కాలేజీ సమీపంలో గల అత్తవారింటి ముందు ధర్నాకి దిగింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అదనపు కట్నం కోసం అత్త,భర్త నిత్యం వేధిస్తున్నారని,తాను నల్లగా,పొట్టిగా ఉన్నానని, ఆడపిల్ల పుట్టిందని ఇంట్లోకి రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.అంతేకాకుండా తనపై అత్త,భర్త కేసు నమోదు చేశారని,తనకు న్యాయం జరిగేంత వరకు అత్తవారింటి ముందు నుండి కదిలేదిలేదని,ఎంతవరకైనా పోరాడుతానని పేర్కొంది.
సుష్మ చేస్తున్న న్యాయ పోరాటానికి మహిళా సంఘం నాయకురాలు పిడమర్తి నాగేశ్వరి మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో జానకి,మీరా,సునిత,లక్ష్మీ,సుశీల తదితరులు పాల్గొన్నారు.