సూర్యాపేట జిల్లా: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రామ్ ఠాక్రే,మాజీ టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట నియోజకవర్గ నేతల మధ్య అంతర్గత పోరు బహిర్గతమైంది.గత కొంత కాలంగా రెండు వర్గాలుగా చీలిపోయిన మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో సమావేశానికి హాజరైన పార్టీ శ్రేణులు నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జరిగిన నల్లగొండ పార్లమెంట్ స్థాయి హథ్ సే హాథ్ జోడోయాత్ర ప్రారంభోత్సవ సమీక్షా సమావేశంలో చోటుచేసుకుంది.
బుధవారం నల్లగొండ ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి అధ్యక్షతన కోదాడలో జరిగిన జొడోయాత్ర సమీక్ష సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవరాల ఇంచార్జ్ మాణిక్ రామ్ ఠాక్రే ముఖ్యాతిథిగా హాజరయ్యారు.
ఈ సమావేశంలో మాజీ మంత్రి,సీనియర్ కాంగ్రెస్ నేత రామిరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని 2017 తర్వాత వలస వచ్చిన నాయకులు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఠాక్రేకు ఫిర్యాదు చేశారు.అదే సమయంలో అక్కడకు చేరుకున్న టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోపలికి ప్రవేశించగా వారిని మీటింగ్ హాల్ నుండి బయటకు పంపించారు.దీనితో నల్లగొండ ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి, ఏఐసీసీ సెక్యూరిటీ పరకాల వేణుగోపాల్ తో పటేల్ రమేష్ రెడ్డి అతని అనుచరులు వాగ్వాదానికి దిగారు.
ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ సమీక్షా సమావేశంలో తమను అవమానపరిచేలా కామెంట్స్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆయనతోపాటు పార్టీలో సీనియర్ నాయకులు వద్ద తనకు సరైన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ కొరకు మేము అహర్నిశలు కృషిచేస్తున్నామని, సభ్యత్వ నమోదు,జోడో యాత్ర సక్సెస్ చేశామని తెలిపారు.ఆర్డీఆర్,పటేల్ వర్గాల మధ్య వివాదం చెలరేగడంతో సమావేశానికి హాజరైన పార్టీ శ్రేణులు అవాక్కయ్యారు.మీటింగ్ కు రేవంత్ వర్గం గైర్హాజరు…? ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జోడో యాత్ర సమీక్షా సమావేశానికి టీపీసీసీ రేవంత్ రెడ్డి వర్గం ఈ సమీక్ష సమావేశానికి హాజరు కాకపోవడం గమనార్హం.కోదాడలో జరిగిన నల్లగొండ పార్లమెంట్ స్థాయి సమీక్షా సమావేశానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 8 నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం అందించారు.
వీరిలో రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన డాక్టర్ చెరుకు సుధాకర్,అద్దంకి దయాకర్,చామల కిరణ్ కుమార్ రెడ్డి,
దుబ్బాక నరసింహారెడ్డి, బీర్ల ఐలయ్య,బత్తుల లక్ష్మారెడ్డి హాజరు కాలేదు.వీరిని మీటింగ్ కు వెళ్లొద్దని టీపీసీసీ నుంచి ఒక నాయకుడు ఫోన్ చేసినట్లు పార్టీ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
సమీక్షా సమావేశంలో కేవలం ఉత్తమ్ వర్గానికి చెందిన నాయకులు మాత్రమే హాజరు కావడం విశేషం.సూర్యాపేట నియోజకవర్గం నుండి హాజరైన రేవంత్ రెడ్డి అంచరుడు పటేల్ రమేష్ రెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం,అతనిని వలసదారుడని,అతని వల్లనే పార్టీ నష్టపోతుందని వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా పటేల్ వర్గం ఆందోళనకు దిగడంతో సమీక్షా సమావేశం రసాభాసగా మారింది.