కాంగ్రేస్ టూ కషాయం దారి క్లియర్ అయిందా?

ఈటెలతో పాటు కోమటిరెడ్డి బీజేపీ నేతలతో భేటి అయ్యారా?ఇక రాజగోపాల్ రెడ్డి కాషాయ రాజకీయం లాంఛనమేనా?తెలంగాణలో వేగంగా రాజకీయ సమీకరణాలు.

 Has Congress Too Cleared The Way For The Infusion?-TeluguStop.com

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయా? తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుందా? అందుకే హైకమాండ్ దూకుడుగా వెళుతోందా? అమిత్ షాతో ఈటల రాజేందర్ చర్చలు తెలంగాణలో ఆసక్తిగా మారగా,తాజాగా ఢిల్లీలో జరిగిన మరో పరిణామం హాట్ హాట్ గా మారింది.హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను ఢిల్లీకి పిలుపించుకుని బీజేపీ అగ్రనేత,కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏకాంతగా మాట్లాడిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈటలకు త్వరలోనే పార్టీలో కీలక పదవి రాబోతుందని ప్రచారం జోరుగా జరుగుతోంది.

ఇదిలా ఉంటే తాజాగా ఢిల్లీలో జరిగిన మరో పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది.అమిత్ షాను కలిసేందుకు ఏనుగు రవీందర్ రెడ్డితో కలిసి వెళ్లిన ఈటల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కారులో వెళ్లడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్,బీజేపీ అగ్రనేతను కలిసేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కారులో ఎందుకు వెళ్లారన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.సదరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గురించి అమిత్ షాతో మాట్లాడటానికే ఈటల రాజేందర్ వెళ్లారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్ లోనూ ఈ విషయంపై పెద్ద రచ్చే జరుగుతుందని తెలుస్తోంది.కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న విషయం విధితమే.

తెలంగాణ ఉద్యమ సమయంలో భువనగిరి ఎంపీగా ఉండి,కాంగ్రేస్ అధిష్టానంపై వత్తిడి పెంచడంలో కీలక భూమిక పోషించిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే తదనంతర పరిణామాల నేపథ్యంలో కొన్ని రోజులుగా ఆయన కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త నేతగా ఉంటూ వస్తున్నారు.

గతేడాది బీజేపీకి అనుకూలంగా ఆయన చేసిన ప్రకటనలు కాంగ్రేస్ వర్గాల్లో కాక రేపాయనడంలో అతిశయోక్తి లేదు.ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతోనూ కోమటిరెడ్డి సమావేశమయ్యారనే వదంతులు వ్యాప్తి చెందగా,అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి.

ఆ సమయంలోనే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది.ఇక పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించాక ఆయన అసమ్మతి స్వరం మరింతగా పెంచారు.

దొంగలకు పదవులు ఇచ్చారని ఓపెన్ గానే కామెంట్ చేసి తన అసంతృప్తిని వెళ్లగక్కారు.టీపీసీసీ క్రమశిక్షాణా సంఘం అతనికి నోటీసులు కూడా ఇచ్చింది.ఆ తర్వాత కూడా కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు రాజగోపాల్ రెడ్డి.టీపీసీసీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాహుల్ గాంధీ వరంగల్ రైతు గర్జన సభకు కూడా హాజరుకాక పోవడం గమనార్హం.

టీపీసీసీ నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నా మునుగోడు నియోజకవర్గంలో మాత్రం ఆ ఊసే లేకపోవడంతో మునుగోడు కాంగ్రేస్ శ్రేణుల్లో స్థబ్దత నెలకింది.ఇలాంటి పరిస్థితుల్లో కోమటిరెడ్డి అసలు కాంగ్రెస్ లో కొనసాగుతారా? లేదా అనే అనుమానాలు పార్టీ కేడర్ లోనూ కలుగుతుంది.అయితే తాజాగా ఢిల్లీలో జరిగిన పరిణామాలతో మరోసారి సీన్ లోకి వచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.ఈటల రాజేందర్ ఆయన కారులోనే వెళ్లి అమిత్ షాను కలవడంతో కోమటిరెడ్డి బీజేపీలో చేరడం ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

రాజగోపాల్ రెడ్డి చేరిక గురించి అమిత్ షాతో ఈటల రాజేందర్ చర్చించారనే ప్రచారం జరుగుతోంది.బీజేపీ పెద్దల నుంచి వచ్చిన సూచనలతో త్వరలోనే కోమటిరెడ్డి కాషాయ కండువా కప్పుకుంటారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ప్రధాని మోడీ సహా కేంద్రం పెద్దలంతా త్వరలోనే హైదరాబాద్ కు రానున్న నేపథ్యంలో బీజేపీ అగ్రనేతల సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమలం గూటికి చేరుతారని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయ పడుతున్నారు.జూలై 3న హైదరాబాద్ లో జరిగే బీజేపీ బహిరంగ సభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాషాయ కండువు కప్పుకుంటారని ఆయన అనుచర వర్గంలో కూడా చర్చ జరగడం నల్లగొండ జిల్లా రాజకీయ వర్గాల్లో వేడిని పుట్టిస్తోంది.

ఇప్పటికే అనేకసార్లు కాషాయ ముహూర్తం ఖరారైందనే వార్తలు వచ్చిన ప్రతిసారి అలాంటిదేమి లేకపోవడంతో ప్రస్తుతం కూడా అదే జరుగుతుందా లేక హస్తానికి హ్యాండిచ్చి ఈసారి పువ్వు చేత పడతారా? చూడాలి మరి…!!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube